Kidney Racket | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సరూర్‌నగర్ అలకనంద దవాఖానలో బయటపడ్డ అక్రమ కిడ్నీ మార్పిడి కేసు దర్యాప్తులో పోలీసులు కీల క విషయాలు గుర్తించారు. ఇప్పటికే 9 మంది ని అరెస్టు చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో అలకనంద దవాఖాన ఎండీ సుమంత్, జనని, అరుణ దవాఖానల ఎండీ అవినాశ్, సహాయకులు ఉన్నారు. . కిడ్నీ రాకెట్ దర్యాప్తు పురోగతిని ఎల్బీనగర్లోని క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
దందా ఎలా మొదలైందంటే!
హైదరాబాద్‌కు చెందిన సిద్ధంశెట్టి అవినాశ్ చైనాలోఎంబీబీఎస్, పుణెలో సర్జరీ డిప్లొమా పూర్తి చేశాడు. కొంతకాలం పుణెలోని ప్రైవేటు దవాఖానలో వైద్యుడిగా పనిచేశాడు. 2022 లో హైదరాబాద్‌కు వచ్చి సైదాబాద్ మాదన్నపేట్రోడ్లో జనని, అరుణ దవాఖానలు ఏ ర్పాటు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో దవాఖానలు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో విశాఖపట్నంకు చెందిన లక్ష్మణ్ పరిచయమ్యయాడు. కిడ్నీ మార్పిడి దందా గురించి చెప్పాడు. దవాఖానలో సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్ సదుపాయం, సర్జ రీ తర్వాత కేరింగ్ సదుపాయం కల్పిస్తే చాలు అని, మిగతా అంతా తాను చూసుకుంటానని తెలిపాడు. జీవన్‌దాన్ నుంచి కిడ్నీ మార్పిడి అవసరమున్న వారి వివరాలను లక్ష్మణ్ తీసుకుని, వారిని సంప్రదించి, బేరం మాట్లాడేవాడు. వివిధ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గిపోయేవారిని మభ్యపెట్టి కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పించేవాడు. కిడ్నీ దాతను, స్వీకర్తను, కిడ్నీ మార్చే డాక్టర్లను అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి అవినాశ్‌కు చెందిన జనని దవాఖానలో కిడ్నీ మార్పిడులు చేయించేవాడు.
కిడ్నీ ఇచ్చిన వారికి 5 లక్షలు ముట్టజెప్పి, మార్పిడి చేసిన డాక్టర్‌కు 10 లక్షలు, ఆపరేషన్ థియేటర్లో ఐదుగురు సిబ్బందికి 30 వేల చొప్పున ఇచ్చేవాడు. దవాఖాన, ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించిన అవినాశ్‌కు ఒక్కో కేసుకు 2.5 లక్షలు ఇచ్చేవాడు. ఇలా 2023 నుంచి 2024 జూన్ వరకు జనని దవాఖానలో కిడ్నీ మార్పిడి దందా నడిచింది. ఆ తర్వాత జనని దవాఖానను మూసివేసిన అవినాశ్ దందాను సరూర్‌నగర్‌లో సుమంత్‌కు చెందిన అలకనంద దవాఖానకు మార్చాడు. అక్రమ కిడ్నీ మార్పిడి ముఠాకు పవన్ అలియాస్ లియోన్ పరిచయం కావడంతో దందా భారీగా విస్తరించింది. పవన్ తన అనుచరుడు పూర్ణతో కలిసి శస్త్రచికిత్సలు జరపడంలో కీలకంగా వ్యవహరించాడు. సర్జరీలు చేసేందుకు తమిళనాడు వైద్యుడు శేఖర్ పెరుమాల్, జమ్ము కశ్మీర్ డాక్టర్ షోయబ్‌ను రంగంలోకి దింపాడు. తమిళనాడు, కర్ణాటకకు చెందిన అపరేషన్ థియేటర్ సహాయకులు శంకర్, ప్రదీప్, సూరజ్‌తో పెద్ద ముఠాను తయారు చేశాడు. థియేటర్ సహాయకులు కిడ్నీ అవసరమున్న రోగుల వివరాలు, కిడ్నీలు ఇచ్చేవాళ్లను వెతికే పనిలోనూ సహాయం చేసేవారు.
గుట్టు రట్టయిందిలా!
అలకనంద దవాఖానలో అక్రమంగా కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్టు జనవరి 21న ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చా డు. ఎల్బీనగర్ ఎస్వోటీ, సరూర్‌నగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి అలకానంద దవాఖానపై దాడులు జరిపారు. సుమంత్, గోపిని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నీ మార్పిడి వివరాలు బయటపెట్టారు. శనివారం జనని దవాఖాన ఎండీ అవినాశ్, ఆపరేషన్ థియేటర్ సహాయకులు ప్రదీప్, రమావత్ రవి, రవీందర్, హరీశ్, సాయి, సూరజ్ మిశ్రాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు పవన్, లక్ష్మణ్, పూర్ణ, తమిళనాడు డాక్టర్ రాజశేఖర్, జమ్మూ కశ్మీర్ డాక్టర్ షోయ బ్, మధ్యవర్తి శంకర్ పరారీలో ఉన్నారు.
ఒక్క నెలలోనే 20 కిడ్నీల మార్పిడి!
సరూర్‌నగర్‌లోని అలకనంద దవాఖానలో 2024 జూలై నుంచి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు యథేచ్ఛగా జరిగాయి. ఒక్కో సర్జరీపై అవినాశ్‌కు వచ్చే రూ.2.5 లక్షల్లో రూ.1.5 లక్షలు అలకానంద ఎండీ సుమంత్‌కు చెల్లించేవాడు. ఇలా నిరుడు డిసెంబర్లోనే 20 కిడ్నీలు మార్చినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. 2023 నుంచి హైదరాబాద్‌లోని జనని, అరుణ, అలకానందతో పాటు ఇతర రాష్ర్టాల్లోని దవాఖానాల్లో ఈ ముఠా దాదాపు 100 కిడ్నీలు మార్చినట్టు తెలుస్తున్నది.