‘ప్రియతమ ప్రజలకు నా మనసులోని మాట చెప్పేందుకు.. వాళ్ల మనసులోని మాట నేను వినేందుకు..’ అంటూ 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రధాని నరేంద్రమోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ప్రజల గోస వినడం అటుంచి తన గొప్పలను చెప్పుకుంటూ పోవడమే ఈ కార్యక్రమ లక్ష్యంగా మారిపోయింది. ఈ ఆదివారానికి ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకొంటున్నది. ఈ క్రమంలో ప్రధాని మనసులోంచి ఇప్పటివరకూ వచ్చిన 100 హామీలు.. వాటి పరిస్థితి ఎలా ఉన్నదంటే??
Mann Ki Baat | (కడవేర్గు రాజశేఖర్) స్పెషల్ టాస్క్ బ్యూరో, సమస్తే తెలంగాణ హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): 2014లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఒకదాని వెంట ఒకటిగా వందలాది హామీలు ఇచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన 100 హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటికీ పూర్తిగా అమలుకాలేదు.
హామీ: ఏడాదికి రెండు కోట్ల చొప్పున ఉద్యోగాల కల్పన.
పరిస్థితి: ఉద్యోగాలు లేకుండా 22 కోట్ల మంది పడిగాపులు కాస్తున్నారు.
హామీ: రైతుల ఆదాయం రెట్టింపు
పరిస్థితి: ప్రస్తుత ద్రవ్యోల్బణం బట్టి రైతు ఆదాయం ఒక్క పైసా కూడా పెరుగలేదు. అయితే, వ్యవసాయ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయ్యింది.
హామీ: పెద్ద నోట్లను రద్దు చేసిన 50 రోజుల్లోగా ఫలాలు లభిస్తాయి.
పరిస్థితి: 2,360కిపైగా రోజులు గడిచాయి. ఇంకా ఫలితం కనిపించట్లేదు. రైద్దెన నోట్లు అన్నీ దాదాపుగా బ్యాంకులకు వచ్చిచేరాయి.
హామీ: పరిశ్రమలకు ప్రోత్సాహకాన్ని ఇచ్చి విస్తరణకు సాయం చేశాం.
పరిస్థితి: తొమ్మిదేండ్లలో రోజుకు 270 కంపెనీల చొప్పున ఇప్పటికే దాదాపు 8 లక్షల కంపెనీలకు తాళం పడింది.
హామీ: ప్రతీ పంట పొలానికి సాగు నీరు
పరిస్థితి: 40 శాతం పొలాలకు సాగు నీరు సక్రమంగా అందట్లేదు.
హామీ: ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా.
పరిస్థితి: దేశంలో ఇప్పటికీ 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతా లేదు.
హామీ: ఇంటింటీకీ వంటగ్యాస్.
పరిస్థితి: ధరల భారం భరించలేక 21 కోట్ల మంది గ్యాస్ సిలిండర్‌కు దూరంగా ఉన్నారు.
హామీ: గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తాం.
పరిస్థితి: 9 ఏండ్ల పాలనలో గ్యాస్ ధర 180 శాతం పెరిగింది.
హామీ: ప్రతీ ఒక్కరికీ జీవిత బీమా పాలసీ.
పరిస్థితి: ప్రతి వంద మందిలో ముగ్గురికే జీవిత బీమా పాలసీ ఉన్నది.
హామీ: ప్రతీ ఒక్కరికీ ప్రమాద బీమా.
పరిస్థితి: 35% మందికి ప్రమాద బీమా లేదు.
హామీ: ప్రతీ ఒక్కరికీ పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్.
పరిస్థితి: 40 కోట్ల మంది పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్ పరిధిలో లేరు.
హామీ: 24 గంటలపాటు విద్యుత్తు సౌకర్యం.
పరిస్థితి: దేశంలో ఇంకా 13% ఇండ్లకు విద్యుత్తు సౌకర్యం లేదు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే కరెంట్ సరఫరా అవుతున్న ప్రాంతాలు 40 శాతం.
హామీ: జీడీపీ 10%కు పెంచుతాం.
పరిస్థితి: ప్రస్తుతం జీడీపీ 6.8 శాతంగా ఉన్నది.
హామీ: 2022 నాటికి అందరికీ ఇండ్లు.
పరిస్థితి: ప్రతి ఇద్దరిలో ఒకరికి సొంతిల్లు లేదు.
హామీ: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి.
పరిస్థితి: దేశంలో 19.4% కుటుంబాలకు మరుగుదొడ్డి లేదు.
హామీ: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం.
పరిస్థితి: 25,067 గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు.
హామీ: ప్రతి భారతీయుడికి సురక్షిత తాగునీరు.
పరిస్థితి: 50% ఇండ్లకు నల్లా కనెక్షన్ లేదు. 70 శాతం ఇండ్లకు నీటి సరఫరా లేదు
హామీ: దేశాన్ని పోషకాహార లోపరహితంగా మారుస్తాం.
పరిస్థితి: 70% మంది పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు.
హామీ: రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చర్యలు.
పరిస్థితి: నిరుడు జరిగిన 13 వేల రైలు ప్రమాదాల్లో 12 వేల మంది మృతి చెందారు.
హామీ: 2022 నాటికి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి.
పరిస్థితి: ఇప్పటికే మూడుసార్లు డెడ్‌లైన్ మార్చారు. ఇంకా ప్రాజెక్టు పనులు 40 శాతం పెండింగ్‌లో ఉన్నాయి.
హామీ: పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించి వాయుకాలుష్యాన్ని తగ్గిస్తాం.
పరిస్థితి: డబ్ల్యూహెచ్‌వో పరిమితి కంటే దేశంలో వాయుకాలుష్యం 10 రెట్లు ఎక్కువ
హామీ: పీఎం 2.5 (పార్టికులేట్ మ్యాటర్)ను 50 మైక్రాన్లకు తగ్గించటం.
పరిస్థితి: ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రకారం.. ఢిల్లీతోపాటు అనేక నగరాల్లో పీఎం స్థాయి ఇప్పటికీ 300కు పైనే ఉన్నది.
హామీ: మలమూత్రాలను మనుషులు తొలగించే విధానాన్ని పూర్తిగా రూపుమాపటం.
పరిస్థితి: ప్రభుత్వ లెక్కల ప్రకారం 42,303 మంది ఇంకా చేతులతోనే అశుద్ధాన్ని ఎత్తిపోస్తున్నారు. వీరి సంఖ్య లక్ష దాటొచ్చని ఎన్జీవోలు చెప్తున్నాయి.
హామీ: మహిళా కార్మిక శక్తిని 30 శాతానికి పెంచటం.
పరిస్థితి: శ్రామికశక్తిలో మహిళా కార్మికశక్తి 19 శాతమే.
హామీ: స్కూల్ డ్రాపౌట్లు జీరో చేయటం.
పరిస్థితి: 15 కోట్ల మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు.
హామీ: వైద్యుడు, జనాభా నిష్పత్తిని 1:1,400కి చేర్చడం
పరిస్థితి: వైద్యుడు, జనాభా నిష్పతి 1:2,000 కంటే అధ్వాన్నంగా ఉన్నది
హామీ: నర్సు, జనాభా నిష్పత్తిని 1:500కు చేర్చటం
పరిస్థితి: నర్సు, జనాభా నిష్పతి 1:800గా ఉన్నది
హామీ: అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచటం.
పరిస్థితి: తొమ్మిదేండ్లలో అడవుల విస్తీర్ణం కేవలం 0.71% పెరిగి 21.71% చేరింది.
హామీ: సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌పై పూర్తిగా నిషేధం.
పరిస్థితి: సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను మెట్రో సహా పలు ప్రాంతాల్లో ఇంకా వినియోగిస్తున్నారు.
హామీ: శ్రామిక శక్తిలో నైపుణ్యాన్ని 15 శాతానికి పెంచటం.
పరిస్థితి: దేశంలో నైపుణ్య మానవ వనరులు 4.69 శాతమే
హామీ: పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యాన్ని 175 గిగావాట్లకు పెంచటం.
పరిస్థితి: ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం 98 గిగావాట్లే.
హామీ: ఉత్పాదక రంగం వృద్ధిరేటును రెట్టింపు చేయటం.
పరిస్థితి: ప్రస్తుతం 8.1 శాతం దాటట్లేదు.
హామీ: ప్రభుత్వ దవాఖానలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ సెంటర్లుగా మార్చటం.
పరిస్థితి: 100 సెంటర్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకోగా.. ప్రారంభించింది పదింటిని. వాటినీ మూసేశారు.
హామీ: ఆరోగ్యరంగంలో 30 లక్షల ఉద్యోగాల సృష్టి.
పరిస్థితి: 30 శాతం కూడా చేరుకోలేదు.
హామీ: పర్యాటకరంగంలో 4 కోట్ల ఉద్యోగాల సృష్టి.
పరిస్థితి: 50 శాతంలోపే జరిగింది.
హామీ: గనుల్లో 50 లక్షల ఉద్యోగాల సృష్టి
పరిస్థితి: 30 శాతం దాటలేదు.
హామీ: ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ
పరిస్థితి: ప్రకటనగానే మిగిలింది. ఆచరణ శూన్యం.
హామీ: మెడికల్ టూరిజంను పెంచేందుకు 20 మెడికల్ ఫ్రీ జోన్ల ఏర్పాటు.
పరిస్థితి: ఒక్కటీ ఏర్పాటు చేయలేదు.
హామీ: వెనుకబడిన వందకుపైగా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయటం.
పరిస్థితి: ఒక్క ప్రాంతాన్ని కూడా టూరిస్ట్ స్పాట్‌గా మార్చలేదు.
హామీ: విదేశీ పర్యాటకుల సంఖ్యను 1.20 కోట్లకు పెంచటం.
పరిస్థితి: టూరిస్టుల సంఖ్య 40 శాతం పడిపోయింది.
హామీ: పది ఇన్నోవేషన్ జిల్లాల ఏర్పాటు.
పరిస్థితి: ఒక్కటీ ఆచరణలో కనిపించట్లేదు.
హామీ: విద్యార్థులకు ఆరో తరగతి నుంచే నైపుణ్య శిక్షణ.
పరిస్థితి: ప్రకటనగానే మిగిలింది. ఆచరణ శూన్యం.
హామీ: చమురు, సహజవాయు దిగుమతులు తగ్గించటం
పరిస్థితి: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ దిగుమతులకు చైనానే దిక్కుగా మారింది.
హామీ: మైనింగ్ రంగంలో వృద్ధిరేటు 14% పెంచటం
పరిస్థితి: 7 శాతం కూడా దాటలేదు.
హామీ: జాతీయ రహదారులను 2 లక్షల కిలోమీటర్లకి పెంచటం.
పరిస్థితి: సగంకూడా జరుగలేదు.
హామీ: 2022నాటికి అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయడం.
పరిస్థితి: మూడుసార్లు డెడ్‌లైన్ మార్చారు. 40 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నట్టు నీతిఆయోగ్ తెలిపింది.
హామీ: ఉన్నత విద్యలో జీఈఆర్ 35%కు పెంచటం
పరిస్థితి: ఇప్పటికీ నెరవేరలేదు.
హామీ: 24,800 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం
పరిస్థితి: సగం కూడా పూర్తవలేదు.
హామీ: మేకిన్ ఇండియా స్కీం సాయంతో భారత్‌ను తయారీ రంగానికి హబ్‌గా మారుస్తాం. 10 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తాం.
పరిస్థితి: వందేభారత్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కూడా రష్యా కంపెనీలకు కట్టబెట్టారు. పనులు లేక 5 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు.
హామీ: డిజిటల్ ఇండియా సాయంతో 100% డిజిటల్ లిటరసీ సాధిస్తాం.
పరిస్థితి: 30 శాతం మందికి డిజిటల్ లిటరసీపై అవగాహన లేదు. స్కీం అట్టర్ ఫ్లాప్.
హామీ: స్కిల్ ఇండియా సాయంతో యువతకు నైపుణ్య శిక్షణ.
పరిస్థితి: ఎన్రోల్ చేసుకొన్న వారికి 9 ఏండ్లలో పూర్తైన శిక్షణ 20 శాతమే.
హామీ: 2019 నాటికి తొలి విడుతలో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం.
పరిస్థితి: 41 శాతం పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
హామీ: నల్లధనాన్ని వెలికితీసుకొచ్చి, బాధ్యులను శిక్షిస్తాం.
పరిస్థితి: బ్యాంకులకు రూ.లక్షల కోట్లు ఎగనామం పెట్టినవాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
హామీ: ‘నమామీ గంగే’ మిషన్ ద్వారా గంగమ్మను స్వచ్ఛంగా మారుస్తాం.
పరిస్థితి: రూ.30 వేల కోట్ల నిధులు గంగపాలయ్యాయి. 50 శాతం మురికి కూడా పోలేదు.
హామీ: ‘స్వచ్ఛ భారత్ అభియాన్’తో 2019 నాటికి పరిశుభ్ర భారత్‌గా ఇండియా.
పరిస్థితి: అమెరికన్ల డస్ట్‌బిన్‌గా భారత్ మారింది. ఏటా లక్షల టన్నుల అమెరికన్ల హానికారక వేస్ట్‌ను యూపీలోని ముజఫర్‌నగర్‌లో డంప్ చేస్తున్నారు. స్వచ్ఛభారత్ కోసం పెట్టిన రూ.2.3 లక్షల కోట్లు గాలిలో కలుస్తున్నాయి.
హామీ: బాల్స్వచ్ఛ్ మిషన్‌తో పరిశుభ్రతపై చిన్నారుల్లో అవగాహన, సరైన వైద్యం అందజేత.
పరిస్థితి: పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో స్లమ్ ఏరియాల్లోని 30 శాతం మంది పిల్లలకు అంటువ్యాధులు సోకుతున్నాయి. వైద్యసదుపాయాలు అందక అవస్థలు పడుతున్నారు.
హామీ: ‘బేటీ బచావో.. బేటీ పడావో’తో ఆడబిడ్డలకు చదువు, భద్రత కల్పించడం.
పరిస్థితి: ఇంకా 13 కోట్ల మంది ఆడపిల్లలు, మహిళలు చదువుకు దూరంగానే ఉన్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతీ రోజూ 86 రేప్ కేసుల చొప్పున రిజిస్టర్ అవుతున్నాయి.
హామీ: హృదయ్ స్కీం ద్వారా వారసత్వ కట్టడాల పరిరక్షణ.
పరిస్థితి: తొమ్మిదేండ్ల మోదీ పాలనలో ఒక్క ఢిల్లీ సరిహద్దుల్లోనే 50కి పైగా పురాతన కట్టడాలు కనుమరుగైపోయాయి.
హామీ: ‘పీఎం జన్‌ధన్ యోజనా’తో బలహీన వర్గాలకు ఆర్థిక స్వావలంబన.
పరిస్థితి: నల్లధనాన్ని తీసుకొచ్చి.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలను ప్రధాని మోదీ జమ చేస్తారని 48 కోట్ల మంది ఈ ఖాతా తీసుకొన్నారు. అది జరుగకపోవడంతో ఆ ఖాతాను వాడటం మానేశారు.
హామీ: ముద్రా యోజనా ద్వారా చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించడం.
పరిస్థితి: సవాలక్ష నిబంధనలు పెట్టి శిశు క్యాటగిరీ కింద రూ.10 వేలు కూడా రుణాన్ని ఇస్తలేరని వేలాది మంది ఆరోపించారు.
హామీ: 2019 నాటికి ప్రతీ ఎంపీ మూడు గ్రామాలు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి.
పరిస్థితి: సాక్షాత్తూ ప్రధాని మోదీ దత్తత తీసుకొన్న 8 గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి.
హామీ: గ్రామీణ కౌశల్ యోజనతో పల్లెప్రాంతాల్లోని యువతకు ఉపాధి.
పరిస్థితి: సరైన శిక్షణ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో 40 శాతం మంది యువత పట్టణాలకు వలస వెళ్తున్నారు.
హామీ: ‘మహాత్మాగాంధీ ప్రవాసీ సురక్ష యోజనా’తో విదేశాలకు వెళ్లాలనుకొన్న పేద, మధ్యతరగతి వారికి చేయూత.
పరిస్థితి: ప్రభుత్వం నుంచి ఆశించినంత సాయం అందట్లేదని ప్రతీ ఇద్దరిలో ఒకరు చెప్తున్నారు.
హామీ: ‘ఇంద్రధనుస్సు’ స్కీంతో నవజాత శిశువులకు ఏడు వ్యాక్సిన్లు ఇవ్వడం.
పరిస్థితి: మూడు వ్యాక్సిన్లకు మించి ఇవ్వట్లేదు.
హామీ: నేల రకాలను రైతులకు తెలియజేసేందుకు ‘సాయిల్ హెల్త్‌కార్డ్’ స్కీం ప్రకటన.
పరిస్థితి: 80శాతం మంది రైతులకు ఇప్పటికీ ఎటువంటి కార్డులు ఇవ్వలేదు.
హామీ: దేశంలో కనెక్టివిటీకి దూరంగా ఉన్న దాదాపు 500 ప్రాంతాలకు ‘ఉడాన్’ ద్వారా వైమానిక సేవలు.
పరిస్థితి: 15 శాతం లక్ష్యాన్ని చేరలేదు.
హామీ: దళిత మహిళల ఆర్థిక సాధికారతకు ‘స్టాండప్ ఇండియా’ పథకం.
పరిస్థితి: రుణాల మంజూరులో జాప్యంతో ఎన్రోల్మెంట్స్ తగ్గిపోయాయి.
హామీ: స్టార్టప్ ఇండియా పథకంతో యువశక్తికి కొత్త శక్తి ఇవ్వడం.
పరిస్థితి: కేంద్రప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ప్రారంభమైన ప్రతీ మూడు స్టార్టప్‌లలో ఒకటి మూతపడుతున్నది.
హామీ: సరిహద్దుల్లో భారత్‌ను శక్తిమంతంగా మార్చడం
పరిస్థితి: లఢక్, అరుణాచల్‌లో చైనా దురాక్రమణ, పుల్వామాలో పాక్ ఉగ్రదాడులు జరిగాయి.
హామీ: ఖాదీని ఆదరించాలి. గాంధీ వారసత్వాన్ని కొనసాగించాలి. చేనేతను ప్రోత్సహించాలి.
పరిస్థితి: చేనేతపై 5 శాతం జీఎస్టీ విధించి నేతన్న వెన్ను విరిచారు. ఖాదీకి ప్రభుత్వం నుంచే ప్రోత్సాహం కరువైంది.
హామీ: మాదకద్రవ్య విముక్త దేశంగా భారత్.
పరిస్థితి: ప్రాణమిత్రుడికి చెందిన అదానీ ముంద్రా పోర్ట్‌లో అత్యధికంగా డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
హామీ: గ్రామగ్రామాన వర్షపు నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు.
పరిస్థితి: నిర్మాణం, నిర్వహణలేక ఇప్పుడు ఎక్కడా వాటి ఆనవాళ్లు లేవు.
హామీ: ప్రతీవారం 200 గ్రామాల చొప్పున విద్యుదీకరిస్తాం.
పరిస్థితి: ఈ హామీ కూడా నెరవేరలేదు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కూడా మొన్నటివరకూ కరెంటు సౌకర్యమే లేకపోవడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
హామీ: ఐక్యత, ప్రేమ పునాదిగా కశ్మీర్ సంక్షోభాన్ని పరిష్కరిస్తాం. ఉగ్రదాడులను నివారిస్తాం.
పరిస్థితి: రాష్ర్టాన్ని రెండు యూటీలుగా చేశారు. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేశారు. ఉగ్రదాడులు మాత్రం ఆగలేదు.
హామీ: దేశంలో ఐక్యత, సామరస్యత కోసం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’.
పరిస్థితి: బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాతే మూకదాడులు ఎక్కువయ్యాయి.
హామీ: జల సంరక్షణకు ఐదు లక్షల చెరువులు నిర్మిస్తాం.
పరిస్థితి: ఇప్పటివరకూ ఒక్క చెరువును నిర్మించినట్టు రికార్డుల్లో లేదు.
హామీ:2022 నాటికి మతతత్వ రహిత భారత్.
పరిస్థితి: దేశంలో ఎక్కడో ఓ చోట మత కలహాలు జరుగుతూనే ఉన్నాయి.
హామీ: ఫసల్ బీమా యోజనలో రెండేండ్లలో 50 శాతం మంది రైతులను చేరుస్తాం.
పరిస్థితి: 20% మంది కూడా చేరలేదు.
హామీ: అమ్మభాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం
పరిస్థితి: దక్షిణాది భాషలపై హిందీ పెత్తనాన్ని ఉసిగొల్పేలా బీజేపీ అమాత్యులే వెర్రి వ్యాఖ్యలు చేశారు.
హామీ: ఆత్మనిర్భర్ భారత్‌కు వ్యవసాయమే ఆధారం. రైతన్నకు అండగా ఉంటాం.
పరిస్థితి: రైతన్నల ఉసురుతీస్తూ మూడు నల్లచట్టాలను తెస్తూ 800 మంది మరణానికి కారణమయ్యారు. ఆత్మనిర్భర్ భారత్ హామీని గాలికొదిలేశారు.
హామీ: స్వదేశీ వస్తువులనే వాడాలి.
పరిస్థితి: ఆట బొమ్మల నుంచి ఆర్మీ ఆయుధాల వరకు చైనా నుంచే దిగుమతి.
హామీ: డిజిటల్ విప్లవాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ‘ఈ-సంజీవని’ యాప్.
పరిస్థితి: సమాచారాన్ని అప్డేట్ చేయడంలో, సరైన పరిష్కారాలు వేగంగా ఇవ్వడంలో ఫెయిల్.
హామీ: గుజరాత్ 2001 భూకంప బాధితులకు కొత్త ఇండ్లు కట్టిస్తాం.
పరిస్థితి: 22 ఏండ్లు గడిచినా బాధితులకు ఇండ్లు కట్టియ్యలేదు.
హామీ: అవినీతిరహిత సూచీలో దేశాన్ని ఒకటోస్థానానికి తీసుకొస్తాం.
పరిస్థితి: 2014 నుంచి 2022 వరకు అదే 85వ స్థానంలో నిలిచింది.
హామీ: ఆకలిలేని భారతం లక్ష్యం.
పరిస్థితి: 9 ఏండ్లలో ఆకలిసూచీలో భారత్ 52 ర్యాంకులు దిగజారింది.
హామీ: దేశంలో కోటి వై ఫై హాట్స్పాట్ల కోసం ‘పీఎం-వాణి’.
పరిస్థితి: ఈ ప్రాజెక్టు 2 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు.
హామీ: 2019లోనే బహిరంగ మలవిసర్జనరహిత దేశంగా మారిన భారత్.
పరిస్థితి: ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసానికి కూతవేటు దూరంలోనే బహిరంగ మలవిసర్జన చేస్తున్న వారు వేలల్లోనే. యూపీలో కేవలం 4.54 శాతం గ్రామాలే ఓడీఎఫ్ పరిధిలోకి వచ్చాయి.
హామీ: ‘పీఎం ఆవాస్ యోజనా’ కింద 2022 నాటికి 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తాం.
పరిస్థితి: 2.3 కోట్ల ఇండ్లే పూర్తయ్యాయి.
హామీ: ఉపాధిహామీ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం.
పరిస్థితి: బీహార్‌కు అత్యధికంగా వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయి. తెలంగాణ తదితర పది రాష్ర్టాలకు ఒక్కో రాష్ర్టానికి రూ.50 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకూ నిధులు విడుదల కావాల్సి ఉన్నది.
హామీ: కరోనా కారణంగా కుదేలైన వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు ‘పీఎం స్వనిధి’.
పరిస్థితి: 40 శాతం మందికి కూడా లబ్ధి చేకూరలేదు. విడుదలైన అరకొర నిధులు కూడా బీజేపీపాలిత రాష్ర్టాలకే.
హామీ: ఆర్టీఐ సంస్థల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం.
పరిస్థితి: బడ్జెట్ కేటాయింపుల్లో ఆర్టీఐ కమిషన్లకు 80-90 శాతం నిధుల కోత.
హామీ: నిత్యావసర ధరల కట్టడికి తగిన చర్యలు తీసుకొంటున్నాం.
పరిస్థితి: తొమ్మిదేండ్లలో నిత్యావసరాల ధరలు 300 శాతం వరకు పెరిగాయి.
హామీ: సబ్సిడీతోనే పేదలకు గ్యాస్ సదుపాయం అందుతుంది.
పరిస్థితి: 9 ఏండ్ల కాలంలో గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఎత్తేశారు.
హామీ:వన్యప్రాణుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం.
పరిస్థితి: ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మిషన్లకు బడ్జెట్లో సగం నిధుల కోత.
హామీ: రైతన్న ఇంటికే ఎరువుల కిట్.
పరిస్థితి: ఎరువుల కోసం రోజులతరబడి లైన్లలో నిలబడలేక పలువురు అన్నదాతలు మృతి చెందారు.
హామీ: నోట్లరద్దు సమయంలో నలుగురు మాత్రమే మరణించారు.
పరిస్థితి: డబ్బుల కోసం బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి 108 మంది మరణించినట్టు నివేదికలు పేర్కొన్నాయి.
హామీ: ‘హర్ ఘర్ జల్’ పూర్తికావొచ్చింది.
పరిస్థితి: ఇప్పటికీ 50 శాతం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
హామీ: 2022 నాటికి 1500 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తిచేస్తాం.
పరిస్థితి: ఇంకా 835 ప్రాజెక్టులు పెండింగ్‌లోనే. దీంతో నిర్మాణవ్యయం అదనంగా రూ.3.19 లక్షల కోట్లు పెరిగింది.
హామీ: గుజరాత్లో 100 శాతం ఇండ్లకు తాగునీరు, ట్యాప్ కనెక్షన్.
పరిస్థితి: నీటి సరఫరా మాత్రం 60 శాతం ఇండ్లకే జరుగుతున్నది.
హామీ: సాగు చట్టాలను నిరసించిన రైతులపై పెట్టిన కేసులను రెండుమూడ్రోజుల్లో ఎత్తేస్తాం.
పరిస్థితి: ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆ కేసులు అలాగే కొనసాగుతున్నాయి.