హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్‌ను తమవైపు తిప్పుకుని సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, కానీ ప్రజలు ఆ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాటాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు వంద సీట్లు ఖాయమని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరికి మద్దతుగా నిలిచిందో కూడా రాహుల్‌కు తెలియకపోవడం అవగాహనారాహిత్యానికి నిదర్శనమని అన్నా రు. తెలంగాణపై మోదీ ఆది నుంచీ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారని, ఇప్పుడు మరోసారి విషం కక్కారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలు సరికాదని, దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వందరోజులకే వందల కోట్ల స్కాములు బయట పడుతున్నాయని ప్రభుత్వ విప్ గువ్వల బాలరా జు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పుడే ఆ పార్టీ వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆ పథకాలన్నీ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.