హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ) : ఘోస్ట్ సిమ్‌కార్డుల మాటున సైబర్ నేరగాళ్లు చేస్తున్న దోపిడీ అంతాఇంతా కాదు. డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, వలపు వల విసిరి న్యూడ్కాల్స్తో ఆశపెట్టి బాధితుల నుంచి వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ.101.87కోట్లు దోచేయడం సంచలనం రే పుతున్నది. పేదలు, నిరక్షరాస్యులే కాదు కొత్త సిమ్ లేదా మొబైల్ పోర్టబులిటీ కోసం వినియోగదారుల కండ్లు కప్పి డబుల్ బయోమెట్రిక్ తీసుకొని మరో సిమ్(ఘోస్ట్ సిమ్) యాక్టివేట్ చేయడం ద్వారా ఈ మోసానికి తెగబడుతున్నారు. టెలికామ్ ప్రమోటర్లు, పీవోఎస్ ఏజెంట్లతో కుమ్మక్కై సాగిస్తున్న ఈ ఘరానా దొంగలు దేశవ్యాప్తంగా 1,194 సిమ్‌లతో 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్టు ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 దాడులతో వెలుగుచూసింది.
13 రాష్ర్టాల్లో దాడులు
13రాష్ర్టాల్లో ఏడు రోజులపాటు దాడులు చేసి 66మంది నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 544 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్‌లు ఉండ గా, 112 ఓపెన్డ్ సిమ్‌లు ఉన్నా యి. వీరిలో 44మంది ఘోస్ట్ సిమ్‌కార్డుల వినియోగదారులు, 20మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్‌కార్డుల సరఫరాదారులు ఉన్నారు. నెట్వర్క్లవారీగా పరిశీలిస్తే అరెస్ట్ అయిన పీ వోఎస్ ఏజెంట్లలో వొడాఫోన్-ఐడియా 10 మంది, ఎయిర్టెల్ ఏడుగురు, జియో నుంచి ముగ్గురు ఉన్నారని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ర్టాల్లో దాడులు జరిగాయి.
పక్కా వ్యూహంతో వలపు వల
ఈ ఘోస్ట్ నెంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరుస్తారు. మ్యాట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ యాప్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి సైబర్ వల వేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఇలా బాధితుల నుంచి లక్షలు , ఒక్కోసారి కోట్లు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్‌తో బ్లాక్మెయిల్ చేసే సెక్స్టార్షన్ ముఠా లు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే డిజిటల్ అరెస్ట్ ముఠాలు ఈ నెంబర్లనే వాడుతున్నట్టు తేలింది. నెంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు నమ్మిమోసపోతున్నారు. టార్గెట్ పూర్తికాగానే, ఆ సిమ్‌కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికిరాత్రే బోర్డులు తిప్పేస్తున్నారని పోలీసులు చెప్పారు. దందా ను ఛేదించడంలో సైబర్‌క్రైమ్ డీసీపీ అరవింద్‌బాబు, ఏసీపీ శివమారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషిచేశాయని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు.
మాయచేసి ఘోస్ట్ సిమ్ సృష్టించి
వినియోగదారులను మాయచేసి కేటుగాళ్లు ఘోస్ట్ సిమ్‌ను యాక్టివేషన్ చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కొత్త సిమ్ లేదా మొబైల్ పోర్టబులిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండానే అదనపు సిమ్‌కార్డును యాక్టివేట్ చేస్తారు. నెట్వర్క్ సరిగా లేదు, సర్వర్‌డౌన్ అయింది, వేలిముద్ర సరిగా పడటం లేదని ఏజెంట్లు నమ్మించి, రెండు మూడు బయోమెట్రిక్‌లు తీసుకుంటున్నారు. ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్‌లను సైబర్‌నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండా ఈ-సిమ్‌లుగా మార్చి అక్కడి సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేసి దందా సాగిస్తున్నారు.