నారాయణపేట : జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్.టీ పత్తి విత్తనాలను (Fake Cotton Seeds) అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ( Dr. Vineeth ,) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం నారాయణపేట మండలం బండగొండ గ్రామం, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాలలో జిల్లా పోలీసు( Police ) , టాస్క్ ఫోర్స్ ( Taskforce ) ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో సుమారు రూ. కోటి విలువైన 10 టన్నుల నకిలీ హెచ్.టీ ( HT Cotton )పత్తి విత్తనాలను స్వాధీనం చేస్తుకున్నట్లు వెల్లడించారు.
కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామానికి చెందిన వి. బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడు అనే తండ్రి, కొడుకుల ఇళ్ల నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. బాలకృష్ణ నాయుడు గతంలో మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయని తెలిపారు.
రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని , అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు , వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేయడానికి సరిపడే పరిమాణంలో ఉన్నాయని వివరించారు. గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనాలని రైతులకు సూచించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అభినందించారు.