మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 3: లంచం తీసుకుంటూ డిప్యూటీ డీసీటీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూ రు మండలం పిల్లిగుండు తండాకు చెందిన రాత్లావత్ సంతోష్ నాయక్ మహబూబ్‌నగర్‌లోని మర్లులో వ్యాపారం కోసం ఓ దుకాణం అద్దెకు తీసుకున్నాడు. జీఎస్టీ లైసెన్స్ కోసం గత నెల 17న జడ్చర్లలో సీఐ ఉస్మాన్‌ను సంప్రదించి ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు డిప్యూటీ డీసీటీవో వెంకటేశ్వర్‌రెడ్డి గత నెల 22న దుకాణంలో తనిఖీ చేశాడు. దుఖాణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, లైసెన్స్ రద్దు చేస్తానని చెప్పాడు. ఏమైనా ఉంటే చెల్లిస్తానని దుకాణం యజమాని చెప్పడంతో రూ.50 వేలు ఇవ్వాలని వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చెప్పగా.. రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ప్లాన్ ప్రకారం.. మంగళవారం మహబూబ్‌నగర్ న్యూటౌన్‌లోని డిప్యూటీ డీసీటీవో కార్యాలయంలో నగదు అందిస్తుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారించారు. అధికారిది గద్వాల జిల్లా కేంద్రం కావడంతో అక్కడా ఆయన ఇంట్లో సోదా లు నిర్వహించారు. నిందితుడిని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్టు ఏఎస్పీ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఇక నుంచి బాధితుల పేర్లను వెల్లడించబోమని ఏసీబీ మంగళవారం ప్రకటించింది. కొన్ని భద్రతా కారణాల రీత్యా బాధితుల పేర్లను అత్యంత గోప్యంగా ఉంచనున్నట్టు వెల్లడించింది. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి, వారి బంధు వర్గం నుంచి బాధితులకు ముప్పు పొంచి ఉండటంతోనే ఈ జాగ్రత్తలు తీసుకునేందుకు నిర్ణయించినట్టు తెలిపింది. ఇక నుంచి బాధితులెవరైనా నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరింది.