హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్య చిన్న వయస్సులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారు ప్రారంభించిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్వోఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ్చారు. హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ లభించిన పది మంది పేద విద్యార్థినులకు ఫౌండేషన్ నుంచి సాలర్షిప్ అందజేశారు. కాలేజీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు సాలర్ షిప్స్‌ను ఆదిత్య, ఆర్య పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్దతు ఇస్తామని చెప్పారు. తన కుమారులు ఇద్దరు సమాజ సేవ కోసం ఫౌండేషన్‌ను స్థాపించి విద్యార్థులకు చేయూతనందించడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. చిన్న వయసులోనే వాళ్లు గొప్పగా ఆలోచించడం తల్లిగా గర్వపడుతున్నానని చెప్పారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సాలర్షిప్స్ అందుకున్న విద్యార్థులను ఆమె అభినందించారు.