హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): గణేశ్ పండుగలో అత్యంత కీలక ఘట్టం లడ్డూ వేలం. నవరాత్రులు పూజలు అందుకున్న గణేశుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఏ లడ్డూ ఎంత ధర పలికిందోనని అందరూ ఆసక్తిగా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. శనివారం నగరంలోని పలు మండపాల వద్ద జరిగిన లడ్డూ వేలం పాటల్లో భక్తులు లక్షలు వెచ్చించి గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈసారి బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లా లంబోదరుడి లడ్డూ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ. 2.32 కోట్ల ధర పలికింది. విల్లావాసులందరూ కలిసి ఈ లడ్డూను దక్కించుకున్నారు. సాధారణంగా లడ్డూ వేలానికి ముందు విల్లాస్ నివాసితులను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. వేలంలో అన్ని గ్రూపులు పాల్గొంటాయి. ఎక్కువ ధర పలికిన గ్రూపు లడ్డూను దక్కించుకుంటుంది. మిగిలిన మూడు గ్రూప్ సభ్యులు ఎంతవరకు వేలం పాట పాడారో ఆ సొమ్మును అందిస్తారు. అలా వచ్చిన మొత్తాన్ని లడ్డూ ధరగా నిర్ణయిస్తారు. కాగా, నిరుడు ఇక్కడే లడ్డూ ధర రూ. 1.87 కోట్లు పలికింది. ఇప్పుడా రికార్డును తాజా ధర బీట్ చేసింది.
లడ్డూ వేలం అనగానే తొలుత అందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడే. బాలాపూర్‌లో నిరుడు రూ.30.01 లక్ష లు పలికిన లడ్డూ ఈసారి ఏకంగా రూ. 35 లక్షలు పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెం దిన లింగాల దశరథ్‌గౌడ్ బాలాపూర్ గణపతి లడ్డూను చేజిక్కించుకున్నారు. 1994లో తొలిసారి బాలాపూర్ లడ్డూను ఓ భక్తుడు రూ. 450కి దక్కించుకున్నా డు. ఆ తర్వాత ఏటేటా దాని ధర పెరుగు తూ ఇప్పుడు లక్షలకు చేరుకుంది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ సమితి గ్రామాభివృద్ధి కోసం వెచ్చిస్తుంది. ఇలా ఇప్పటి వరకు రూ. 1,64,87,970 ఖర్చు చేసినట్టు ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. వేలంపాటకు హాజరైన మాజీమంత్రి సబిత మాట్లాడుతూ బాలాపూర్‌లో పుట్టిన వారంతా అదృష్టవంతులేనని, బాలాపూర్ గణనాథుడు కొలువుదీరిన ఈ మహేశ్వరం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.