హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10% కమీషన్ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వివేకానంద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో విదేశీ విద్యానిధి పథకంపై ఎమ్మెల్యేలు వివేకానంద, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్‌జాదవ్ పలు ప్రశ్నలను సంధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ విదేశీ విద్యానిధి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిందని, 3,4 విడతల నిధులను విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
భవిష్యత్తులో ఈ పథకాన్ని కొనసాగిస్తారా? లేదా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. 10 శాతం చెల్లిస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని, విదేశీ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయంలో రూ.5 లక్షలను తీసుకుంటున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే సైతం గతంలో ప్రస్తావించారని వివేకానంద ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందిని ఎంపిక చేశారు? ఎన్ని నిధులను ప్రభుత్వం విడుదల చేసింది? అనే వివరాలను అందివ్వాలని డిమాండ్ చేశారు.
విదేశీ విద్యానిధి పథకానికి కేవలం రూ. 80 కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని, అందులో ఇప్పటివరకు రూ.30 కోట్లనే విడుదల చేసిందని మలాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ విద్యార్థులకు ఓవర్సీస్ సాలర్షిప్లు మంజూరు చేసే ప్రక్రియ పూర్తిగా మందగించిందని తెలిపారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండో, మూడో విడత చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయని వివరించారు.
ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ ఇస్తుందా? లేదా? అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకాన్ని గతంలో లాగానే నిరాటంకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విదేశీ విద్యానిధి పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసే ఉద్దేశం తమకు లేదని మంత్రి సీతక్క స్పష్టంచేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధామిచ్చారు. ఇప్పటివరకు 8,723 మంది ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వెళ్లగా, వారికి రూ.1396.25 కోట్లను చెల్లించామని, ఇంకా 2వ, 3వ విడతలకు సంబంధించి రూ.104.42 కోట్లను మార్చిలోగా చెల్లిస్తామని మంత్రి తెలిపారు.