హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మొకలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వజ్రోత్సవాల ముగింపు వేడుకలపై సీఎస్ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేడుకలను వైభవంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాల ప్రజలను భాగస్వాములు చేయనున్నట్టు వెల్లడించారు. 1.15 కోట్ల జాతీయ జెండాల పంపిణీతోపాటు సినిమాహాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
వేడుకలను పురసరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించనున్నట్టు చెప్పారు. విద్యాసంస్థల్లో వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు, 5కే, 2కే రన్ నిర్వహించనున్నట్టు వివరించారు. స్వాతంత్య్ర పోరా టం, తెలంగాణ ఉద్యమాన్ని తెలిపేందుకు హైదరాబాద్‌లో ఫొటో ఎగ్జిబిషన్ పెట్టనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాల తేదీలను త్వరలోనే సీఎం ఖరారు చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, పీసీసీఎఫ్ డోబ్రియాల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంసృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజారామయ్యర్, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్‌రెడ్డి, పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, ఆయుష్‌శాఖ కమిషనర్ హరిచందన, సాంసృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.