హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అద్భుతం జరుగుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలో తాము వేసుకొన్న అంచనాలకు మించి ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రంలో రూపాయి రాక.. పోక ఏకంగా పది లక్షల కోట్లు దాటిందని పేర్కొన్నారు. రాబోయే ఏడేండ్లలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం దాదాపు రూ.23 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని అంచనాలున్నట్లు చెప్పారు. ఇందులో 1.80 లక్షల కోట్లను దళితబంధు కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. దళితబంధు నిధులకోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీలో దళితబంధుపై చర్చకు సీఎం కేసీఆర్ చెప్పిన సమాధానం ఆయన మాటల్లోనే..
వచ్చే టర్మ్ కూడా మాదే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంచనాలు ఉండాలె.. అవగాహన ఉండాలె. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆర్థికరంగ నిపుణులను, అధికారులను పిలిచి గత బడ్జెట్ పుస్తకాలను పరిశీలించి ఐదేండ్లలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాలద్వారా సమకూరే నిధి ఎంత? అని పరిశీలించినం. ‘వాట్ ఈజ్ గోయింగ్ టూ బీ ఎకనమిక్ డైనమిక్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ దిస్ వన్ టర్మ్, రెండో టర్మ్’కు ఎంత ఉంటది అని అంచనాలు వేసుకొన్నాం. అప్పుడు మేం వేసుకొన్న అంచనాలు కరెక్ట్‌గా ఉన్నయి. ఇంకా ఎక్కువగానే ఉన్నయి. అందుకే తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను అప్పుడప్పుడు గర్వంగా చెప్తుంట. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే మన రూపాయి రాక, రూపాయి పోక ఏకంగా రూ.10 లక్షల కోట్లు దాటుతుంది.
ఇంకో ఏడేండ్లకు నిన్ననే ఎస్టిమేట్లు వేసినం. ఈ టర్మ్ ఇంకా రెండేండ్లు ఉన్నది. వచ్చే టర్మ్ కూడా ఎలాగూ మేమే ఉంటం. ఈ ఏడేండ్లలో ఏమొస్తదని చూస్తే.. రాబోయే ఏడేండ్లలో రాష్ట్రం ఖర్చు పెట్టే డబ్బు రూ.23 లక్షల కోట్లు అవుతున్నది. ఈ పెద్ద మొత్తంలో దళితబంధుకు అవసరమయ్యే రూ.1.70 లక్ష కోట్లు, లేదా రూ.1.80 లక్షల కోట్లు ఎంత అవుతుంది? దళితబంధుకు అవసరమయ్యే డబ్బును ఎక్కడికెళ్లి తెస్తరు.. ఎట్ల పెడ్తరు.. అంటే ఇట్లా పెడ్తము.