హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 2 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1.65 లక్షల కేసులను పరిష్కరించినట్టు సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చి.. 1,65,522 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. మొత్తం 4,539 మంది బాధితులకు ఒకేరోజు రూ.12.94 కోట్ల రీఫండ్ అందించినట్టు వెల్లడించారు. అంతకుముందు 2,501 మంది బాధితులకు రూ.27.91 కోట్ల రీఫండ్ అందించడంతో మొత్తం రూ.40.86 కోట్ల రీఫండ్‌ను 7,040 మంది బాధితులకు అందించినట్టు చెప్పారు. ఈ ఏడాది అన్ని అదాలత్‌లతో కలిపి మొత్తం రూ.138.04 కోట్ల సైబర్ నేరాల ఫ్రీజింగ్ అమౌంట్‌ను 18,872 మందికి అందజేసినట్టు ఆమె వివరించారు. రూ.40.86 కోట్ల రీఫండ్‌లో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.11.51 కోట్లు, హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 9.29 కోట్లు, రాచకొండ పరిధిలో రూ.6.41 కోట్లు, సీఎస్బీ హెడ్‌క్వార్ట్స్ పరిధిలో రూ.4.21 కోట్లు, సంగారెడ్డి జిల్లా నుంచి రూ.1.04 కోట్లు టాప్-5లో ఉన్నట్టు తెలిపారు. 2024 మార్చి నుంచి 2025 సెప్టెబర్ వరకు 36,786 మంది బాధితులకు రూ.321 కోట్లు రీఫండ్ చేసినట్టు స్పష్టంచేశారు.
అత్యధికంగా ఈ-పెట్టీ కేసులు
జాతీయ లోక్ అదాలత్‌లో సయోధ్యతో ముగిసిన ఎఫ్ఐఆర్ కేసులు 20,964 ఉన్నట్టు చారుసిన్హా తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం కేసులు 883, ఈ-పెట్టీ కేసులు 75,430, మోటారు వాహన చట్టం కేసులు 61,205, సైబర్ నేరాల కేసులు 7,040 ఉన్నట్టు వివరించారు. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29,023 కేసులు, రాచకొండ పరిధిలో 22,278, నల్లగొండ జిల్లాలో 14,002, వరంగల్‌లో 10,309, రామగుండం పరిధిలో 8,358 కేసులు పరిష్కరించిన ట్టు వెల్లడించారు. పోలీస్ యూనిట్లు సమన్వయంతో పనిచేసి ఈ విజయాన్ని సాధించినట్టు చెప్పారు.