హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో 26,326 చెరువుల్లో పంపిణీ చేయాల్సిన 84.62 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ గాను ఇప్పటివరకు 26 జిల్లాల్లో 11.31 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ పేర్కొంది. ఈనెల 17న ‘నమస్తేతెలంగాణ’లో ‘రొయ్యల పంపిణీ ఉందా..లేదా? అనే శీర్షికన ప్రచురితమైన కథనం మత్స్యశాఖలో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంగళ,బుధవారాల్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అధికారుల తీరు వల్లే క్షేత్రస్థాయిలో చేపపిల్లల పంపిణీ ఆలస్యం ఆవుతోందని, దీంతో మత్స్యకారుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని మండిపడినట్టు మత్స్యశాఖ వర్గాల సమాచారం.
దీంతో సంబంధిత అధికారులు గురువారం వివరణ ఇచ్చారు. మంచినీటి రొయ్య పిల్లల పంపిణీకి సంబంధించి ఆగస్టు 25న రాష్ట్రస్థాయి కమిటీ టెండర్లు పిలిచిందని తెలిపారు. టెండర్లకు తుది గడువు సెప్టెంబర్ 8గా నిర్ణయించగా.. ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో తిరిగి అక్టోబర్ 11న మళ్లీ టెండర్లు ఆహ్వానించినట్టు చెప్పారు. అక్టోబర్ 22 మంచినీటి రొయ్య పిల్లల పంపిణీ టెండర్లు ఖరారు చేశామని, 7మంది బిడ్డర్లు టెండర్లు వేశారని, వారి హేచరీలు, చెరువుల పరిశీలన కొనసాగుతున్నదని ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.