హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద రూ.1.2లక్షల కోట్లు జమచేశామని, ఇది దేశ చరిత్రలో ఆల్ టైం రికార్డ్ అని, ఆ పదేండ్లు సాగుకు స్వర్ణయుగమని మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.72,972 కోట్లు, 1.11 లక్షల మందికి రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.6,488 కోట్లు, రెండు దఫాల్లో రుణమాఫీ కింద రూ.29,144.61 కోట్లు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా 11.401 కోట్లు రైతుల అకౌంట్లలో వేశామని శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ పథకాల ద్వారా రైతులకు అందిన ఆర్థిక సాయం రూ.1,20,005 కోట్లు అని తెలిపారు. ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలందక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంటి కిరాయి చెల్లించడం కూడా వారికి భారంగా మారిందని, పీఎఫ్ సైతం జమ కావడం లేదని వారు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ సరారుకు ఈ చిరుద్యోగుల వెతలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.