(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ రేట్లను ప్రభుత్వం తగ్గించట్లేదు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులకు గ్యాస్ బండ మరో మోయలేని భారంగా తయారవుతున్నది. ధరల భారం మోయలేక ఎల్పీజీ రీఫిలింగ్కు పేద, మధ్యతరగతి ప్రజలు క్రమంగా దూరమవుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకొన్న మొత్తం లబ్ధిదారుల్లో గతేడాది 1.18 కోట్ల మంది ఒక్క సిలిండర్ను కూడా రీఫిలింగ్ చేయించుకోలేదు. 2020-21లో ఏడాదికి సగటున 4.4 సిలిండర్ల రీఫిలింగ్ జరిగితే, 2022-23నాటికి ఇది 3.7కు పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభకు వెల్లడించింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్లే లబ్ధిదారులు ఎల్పీజీ రీఫిలింగ్కు దూరంగా ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.