రాజకీయాల్లో సద్విమర్శలు ఉండాలి. ఆరోపణలకు ఆధారాలు ఉండాలి. ఎటు పడితే అటు అడ్డగోలుగా మాట్లాడే వారిని, పార్టీలను తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. అలాంటి పార్టీలకు బుద్ధి చెప్తేనే భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు, ఆరోపణలు ఉండవు.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారత్‌లో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పునరుద్ఘాటించారు. పని చేసే, పనికొచ్చే ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని, తెలంగాణ ప్రజలు కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మీద ఉన్న ఈ నమ్మకంతోనే రానున్న వందేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లో 415 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. బుధవారం ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాగర్‌రింగ్‌రోడ్డు జీఎస్సార్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో 118 జీవో కింద క్రమబద్ధీకరించిన పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఐదేండ్లపాటు 24 గంటలూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, కానీ ప్రతిపక్షాలు 24 గంటలూ అదే రొచ్చులో ఉంటున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ వయసు, అనుభవం, హోదాకు గౌరవం ఇవ్వకుండా, ప్రతిపక్ష నేతలు తెల్లారిలేస్తే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మాకు నోరు లేదా? మాకు మాట్లాడరాదా? కానీ చదువుకున్న వాళ్లమైనందున సంస్కారం అడ్డు వస్తున్నది’ అని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం పెరుగుతున్న వేగాన్ని, విస్తరిస్తున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ రాబోయే 50-100 ఏండ్ల వరకు సరిపడేవిధంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించారని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 70 కిలోమీటర్ల మెట్రో పూర్తయిందని, ఎయిర్‌పోర్టు వరకు మెట్రోతో మొత్తం 101 కిలోమీటర్లకు విస్తరిస్తుందని చెప్పారు. మరో 314 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కూడా క్యాబినెట్లో ఆమోదం తెలిపామని గుర్తుచేశారు. నాగోల్-ఎల్బీనగర్ మెట్రో పనులను వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్‌పేట వరకు మెట్రోను విస్తరిస్తామని, ఔటర్ చుట్టూ 159 కిలోమీటర్ల పొడవున మెట్రో రాబోతున్నదని చెప్పారు. అటు ఇస్నాపూర్ మొదలు ఇటు పెద్ద అంబర్‌పేట వరకు మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత సీఎం కేసీఆర్‌దేనని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను పంద్రాగస్టు నుంచి అక్టోబరు వరకు నిరుపేదలకు పంపిణీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. మూసీపై 14 బ్రిడ్జీల నిర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దుర్గంచెరువు బ్రిడ్జి తరహాలో వీటి నిర్మాణం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, కార్పొరేషన్ చైర్మన్లు సతీశ్‌రెడ్డి, అమరవాది లక్ష్మీనారాయణ, రజిత, కలెక్టర్లు హరీశ్, అమోయ్‌కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ వర్గాల సమస్యలను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను బీసీ సంఘం కోరింది. బుధవారం మంత్రిని తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌యాదవ్ కలిసి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీలో ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని కోరారు.