హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత శంకర్‌నాయక్‌ను డిసెంబర్ 2 వరకు అరెస్ట్ చేయొద్దని వరంగల్ పోలీసులకు హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. లగచర్ల ఘటనలో పోలీసుల చర్యకు నిరసనగా బీఆర్ఎస్ ఈ నెల 25న నిర్వహించతలపెట్టిన కార్యక్రమంలో పాల్గొంటే పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని, తాను ధర్నాలో పాల్గొనేందుకు, పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయాలని శంకర్‌నాయక్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ కే లక్ష్మణ్.. పిటిషనర్ ధర్నాలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.
లగచర్ల ఘటనలో 3 ఎఫ్ఐఆర్లపై వివరాలివ్వండి
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): లగచర్లలో అధికారుల కార్యక్రమంలో రైతులు దాడి చేశారం టూ బొంరాస్‌పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లను ఎం దుకు నమోదు చేశారో పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక నేరానికి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తరఫున ఆయన భార్య శృతి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు.