హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలో సీబీఐ, ఈడీ, ఇతర నిఘాసంస్థలను, చివరికి న్యాయవ్యవస్థను ఎలా ఉపయోగించాలనే చూస్తున్నదని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన నయా హిట్లర్ ప్రభుత్వం భారతదేశంలో ఎప్పుడూ లేదని చెప్పారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో రెండు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో అవినీతి ఆరోపణలెదుర్కొన్న ఒక్క బీజేపీ నేత కూడా అరెస్ట్ కాలేదని తెలిపారు.
మనీ లాండరింగ్ తదితర కేసుల్లో 51 మంది బీజేపీ ఎంపీలపై ఆరోపణలొచ్చాయని, 78 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులున్నప్పటికీ ఒక్కరిపై విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మోదీ పాలనలో 13 లక్షల కోట్ల అదానీ కుంభకోణం, విజయ్‌మాల్యా,లలిత్ మోదీ కుంభకోణాలు చేసినా ఎవరిపై విచారణలు జరిపిన దాఖలాలే లేవని, ఇక అరెస్టులెక్కడని విస్మయం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభు త్వ పథకాలు పేదలను కొట్టి పెద్దలకు మేలు చేసేలా ఉన్నాయని విమర్శించారు. పేదలకిచ్చే మొత్తం సబ్సిడీ రూ.5 లక్షల కోట్లయితే, ఈసారి దాన్ని రూ.3 లక్షల కోట్లకు తగ్గించారని తెలిపారు. సంపన్నులకు కార్పొరేట్ పన్నును 30% నుంచి 22 శాతానికి తగ్గించారని చెప్పారు. ఎన్పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్ల సంపన్నుల బకాయిలు రద్దు చే శారని వెల్లడించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే గీతాముఖర్జీ కమిటీ సిఫారసు మేరకు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
సీబీఐ, ఈడీ దుర్వినియోగం: అజీజ్ పాషా
ప్రతిపక్షాలలో చీలిక తీసుకువచ్చేందుకే మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా విమర్శించారు. ప్రతిపక్షాలు ఏకమైతే తాము గెలవలేమనే భయంతో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కార్ ధరలను విపరీతంగా పెంచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.