ముషీరాబాద్, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గుడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
గురువారం విద్యానగర్లోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండున్నరేండ్లలో ఒక్క దళితుడికి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ సైతం సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.