చొప్పదండి/ ధర్మపురి/ధర్మారం, జూలై 21 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సు సభకు రోడ్డు మార్గం ద్వారా వెళ్తున్న ఆయనను దారిపొడవునా ఆహ్వానించారు. చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా నీరాజనం పట్టారు. చొప్పదండిలో స్వాగతం పలికి సన్మానించారు. ధర్మారంలోని అంబ్కేర్ చౌరస్తా వద్ద గజమాలతో సత్కరించారు. రాయపట్నంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలువురికి కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.