నిజామాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా అలలు అలలుగా విస్తరిస్తూ కల్లోలం సృష్టిస్తుంటే సామాన్య జనం విలవిల్లాడారు. దవాఖానలు కిక్కిరిసిపోయాయి. ఆక్సిజన్ సమస్య వణికించింది. రాష్ట్ర సర్కారు చాకచక్యంతో చర్యలు చేపట్టి భారీగండం దాటించింది. సెకండ్‌వేవ్ ఉధృతితో ఎదురైన సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణవాయువు సమస్య శాశ్వతంగా లేకుండా ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ చొరవను ప్రేరణగా తీసుకున్న రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు పూనుకొన్నారు. సొంతంగా కొంత డబ్బులు, స్నేహితుల ద్వారా మరింత నిధులు సమకూర్చి కరోనా చికిత్సకు ఇబ్బందుల్లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా ఆక్సిజన్ ప్లాంట్‌ను మోర్తాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలకొల్పారు. అంతేకాకుండా తెలంగాణలో తొలిసారిగా ఆక్సిజన్ బాటిలింగ్ యూనిట్‌ను సైతం మంత్రి వేముల ఏ ర్పాటుచేసి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
కట్టుకున్నోళ్లకు, కన్నవారికి చివరిచూపు లేకుండా చేసిన వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వైద్య సదుపాయాల మెరుగుదల అత్యవసరమని భావించిన ప్రశాంత్‌రెడ్డి.. ప్రజలు పడిన బాధలను, తనను కదిలించిన గాథలను స్నేహితులతో పంచుకున్నారు. మొదటగా రూ.కోటి నిధిని ఏర్పాటు చేసి సీఎస్ఆర్ కింద సౌకర్యాలు మెరుగుపర్చారు. బాల్కొండ నియోజకవర్గంలో అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీలను అత్యవసర చికిత్సలకు అనువుగా మార్చారు. థర్డ్‌వేవ్ ముప్పు అంటూ ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత అన్నదే ఉండొద్దని, మరో అరకోటితో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ కమ్ బాటిలింగ్ యూనిట్‌ను మోర్తాడ్‌లో ఏర్పాటు చేశారు.
బాల్కొండ నియోజకవర్గంలోని దవాఖానల్లో మొత్తం 102 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. బాల్కొండ, మోర్తాడ్ రెండు ఏరియా దవాఖానల్లో, స్వగ్రామం వేల్పూర్ పీహెచ్సీలో ఐదేసి చొప్పున ఐసీయూ బెడ్లు నెలకొల్పారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలోనూ 10 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో అత్యవసర చికిత్సకు అవసరమయ్యే యంత్రాల కొనుగోలుకు మంత్రి వేముల హామీ ఇచ్చారు.
దాహార్తి తీర్చేందుకు ఆర్వో ప్లాంట్లు
సీఎస్ఆర్లో భాగంగానే బాల్కొండ నియోజకవర్గంలోని 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో తాగునీటి ఎద్దడిని మంత్రి వేముల నివారించారు. గంటకు 50 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించే 10 ఆర్వో ప్లాంట్లను పీహెచ్‌సీల్లో నెలకొల్పారు. రెండు సీహెచ్‌సీల్లో గంటకు 100 లీటర్ల కెపాసిటీతో గల ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను సైతం సమకూర్చారు. పలుచోట్ల పీహెచ్సీ, సీహెచ్‌సీ భవనాలను ఆకర్షణీయంగా మార్చేందుకు గోడలకు రంగులు వేసి, కొంగొత్తగా తీర్చిదిద్దే ప్రక్రియ సైతం జరుగుతున్నది.
మోర్తాడ్ సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో ఉత్పత్తి చేసే ఆక్సిజన్ దవాఖాన అవసరాలకే పరిమితం కాలేదు. బల్క్‌గా సిలిండర్లలో నింపే సౌకర్యమూ ఉన్నది. గాంధీ దవాఖానతో సహా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ దవాఖానలోనూ ఆక్సిజన్ ప్లాంట్, బాటిలింగ్ యూనిట్ ఉమ్మడిగా ఏర్పాటు కాలేదు. ప్రశాంత్‌రెడ్డి చొరవతో నెలకొల్పిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఇతర సాధారణ ప్లాంట్లకు భిన్నమైనది. రూ.54 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం, దానికి తోడుగా ప్రెషర్ స్వింగ్ ఎగ్జాప్షన్ సాంకేతికతతో కూడిన బాటిలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో నిమిషానికి 260 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తారు. ఎయిర్ బూస్టర్ కంప్రెషర్ పంప్ ద్వారా బల్క్ సిలిండర్‌లో ఆక్సిజన్ నింపే సౌకర్యం ఇక్కడ ఉన్నది. బాటిలింగ్ యూనిట్ ద్వారా రోజుకు 7 వేల లీటర్ల సామర్థ్యం గల 55 బల్క్ సిలిండర్లు నింపి ఇతర ప్రాంతాలకు తరలించొచ్చు. బాల్కొండ నియోజకవర్గంలోని అవసరాలతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు ఇక్కడి నుంచి ఆక్సిజన్ తరలించే ఆస్కారం ఏర్పడటం విశేషం.
రాష్ట్రంలోనే ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడాలేనివిధంగా కామారెడ్డి జిల్లా మోర్తాడ్ సీహెచ్‌సీలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ తయారీ ప్లాంట్, బాటలింగ్ యూనిట్‌ను రాష్ట్ర గృహనిర్మాణ, రోడ్లు భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మిత్రుల సహకారంతో ఆక్సిజన్ ప్లాంటుతో పాటు ఇతర వైద్యసౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిని మొత్తం రూ.కోటి 54 లక్షలతో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. అనూష ప్రాజెక్ట్స్ రూ.25లక్షలు, ఎస్వీసీ కన్స్ట్రక్షన్స్ రూ.25లక్షలు, కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రూ.25లక్షలు, ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25లక్షలు, డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.44లక్షలు, సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ రూ.10 లక్షలు అందజేశాయని తెలిపారు. వీరందరికీ బాల్కొండ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.
కొవిడ్ సోకినవారికి ఆక్సిజన్ బెడ్లు అత్యవసరం. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వందల బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ పీహెచ్సీ, సీహెచ్సీస్థాయిలో చికిత్సకు ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందని ఆలోచించా ను. ఆలోచనను స్నేహితులతో పంచుకుని వారి సహకారం తీసుకున్నా. ప్రజల మేలు కోసం ప్రభుత్వంతో కలిసి వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని నిర్ణయించుకున్నాం. జిల్లా నలుమూలల నుంచి కరోనా బాధితులు నిజామాబాద్ జీజీహెచ్‌కు బారులు కడితే భారం పడుతుంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనే ఆ వసతి అందుబాటులోకి వస్తే జనరల్, ఏరియా హాస్పిటల్స్‌పై ఒత్తిడి తగ్గుతుంది. వైరస్వ్యాప్తి ఎక్కడికక్కడే నిలువరించిన వాళ్లం అవుతాం. గ్రామీ ణ ప్రాంతవాసులకు అనుకున్న సమయంలో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఇవ్వడం గతంలో కష్టమైంది. నా స్నేహితులతో కలిసి బాల్కొండ నియోజకవర్గంలో పీహెచ్సీ, సీహెచ్‌సీలో 102 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుచేయడం తృప్తిగా ఉంది. ఆక్సిజన్ కొరత ఉండొద్దని రాష్ట్రంలోనే తొలిసారిగా ఆక్సిజన్ జనరేషన్ కమ్ బాటిలింగ్ యూనిట్‌ను మోర్తాడ్ సీహెచ్‌సీలో నెలకొల్పాం. దీనిద్వారా ఆక్సిజన్ అవసరాలు సులువుగా తీర్చే వీలు ఏర్పడింది.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి