అందోల్/శివ్వంపేట/చిన్నశంకరంపేట/యాలాల, మే 19: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కల్లాలు, రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సైతం ధాన్యం తడిసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. శివ్వంపేట కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై కవర్లు కప్పడంతోపాటు అక్కడ వరదనీరు నిల్వకుండా రైతులు పారలతో కాలువలు తవ్వారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో రాత్రి ఈదురు గాలులు వీచాయి. చందాపూర్ గ్రామ శివారులో ఈదురుగాలికి కరెంటు స్తంభం నేలకూలింది. మండలంలోని అంబాజిపేట, రుద్రారం, చందంపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట-సంగారెడ్డి ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రైతులు రోడ్లపై, కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో రెండుచోట్ల పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. మండల పరిధిలోని బెన్నూరుకు చెందిన గొల్ల ఎంకప్ప (60), జుంటుపల్లికి చెందిన మంగలి శ్రీనివాస్ (26), కొన్నింటి లక్ష్మప్ప (45) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.