సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాశమార్గంలో వీక్షించారు. సోమవారం సాయంత్రం హెలికాప్టర్ ద్వారా గోదావరి జలాలు మల్లన్న పాదాలను తాకిన దృశ్యాలను చూసి అమితానందానికి లోనయ్యారు. మల్లన్నసాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు కాగా, ఇటీవలే 10 టీఎంసీల గోదావరి జలాలను తరలించారు. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతలలో అత్యంత కీలకమైన రిజర్వాయర్ నిర్మాణాన్ని విపక్షాలు అడ్డుకొన్నప్పటికీ.. సీఎం పట్టుదలతో రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తిచేయడంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో బహుళ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో మనం కలలు కన్న ప్రాజెక్టులు కల్ల ముందే సాకారమైనవి. ఎడారిగా మారిన మెతుకు సీమలో నేడు సిరులు పండుతున్నాయి. భూమికే బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. పాలకులకు సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టులే నిదర్శనం. మేడిగడ్డ నుంచి తరలించిన గోదావరి జలాలతో పలు ప్రాజెక్టులకు జీవం పోస్తూ చివరి ప్రాజెక్టు అయిన సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టును 2020 ఏప్రిల్, మే నెలలో గోదావరి జలాలు ముద్దాడాయి. నేడు జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు నిండుకుండలా ఉన్నాయి. శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌ను నింపి రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని పంపించడం వల్ల కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగునీరు అందిస్తున్నారు. అక్కడి నుంచి ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కీలకమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని తరలించారు.