ముంబై: టీ20 ప్రపంచకప్‌లో సంచనాలు సృష్టించేందుకు వచ్చిన చిన్న జట్లు ఆ దిశగా అగ్రస్థాయి జట్లకు ఊహించని షాకులిస్తున్నాయి. మొదటి రోజే నెదర్లాండ్స్, యూఎస్ఏ జట్ల పోరాటపటిమతో స్ఫూర్తి పొందిన నేపాల్.. రెండుసార్లు చాంపియన్ ఇంగ్లండ్‌ను వణికించింది. ఇరుజట్ల మధ్య ముంబైలోని వాంఖెడే వేదికగా ఆఖరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన గ్రూప్-సీ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా 4 పరుగుల స్వల్ప తేడాతో నేపాల్‌పై గెలిచింది. బ్రూక్ సేన నిర్దేశించిన 185 పరుగుల ఛేదనలో ఆ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 180/6 వద్దే ఆగిపోయి తృటిలో సంచలనాన్ని నమోదుచేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంది.
దీపేంద్ర సింగ్ (44), కెప్టెన్ రోహిత్ (39), లోకేశ్ (39*) పోరాడారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జాకబ్ బెతెల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (52), విల్ జాక్స్ (39*) రాణించడంతో 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది. బ్యాట్‌తో పాటు బంతితోనూ ఒక వికెట్ తీసిన జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మ్యాచ్‌ను చూసేందుకు నేపాలీలు భారీ స్థాయిలో వాంఖెడేకు రావడం విశేషం.
పటిష్టమైన బౌలింగ్‌ను ఎదుర్కునే క్రమంలో 42 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయినా నేపాల్ పోరాడింది. దీపేంద్ర సింగ్, రోహిత్ మూడో వికెట్‌కు 54 బంతుల్లోనే 82 రన్స్ జోడించి ఆ జట్టును పోటీలోకి తెచ్చారు. కానీ రెండు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో నేపాలీలు ఒకింత నిరాశే ఎదురైంది. అయితే ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన లోకేశ్ వీరోచితంగా పోరాడాడు. 17 ఓవర్లలో 139/4గా ఉన్న ఆ జట్టు.. విజయానికి అత్యంత చేరువగా వచ్చిందంటే అది అతడి పోరాటమే.
ఆర్చర్ 18వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతడు.. వుడ్ తర్వాతి ఓవర్లోనూ రెండు బౌండరీలు బాది బ్రూక్ సేనకు చెమటలు పట్టించాడు. అతడి బాదుడుతో నేపాల్ విజయ సమీకరణం 6 బంతుల్లో 10 రన్స్‌గా మారింది. అయితే చివరి ఓవర్ వేసిన సామ్ కరణ్.. యార్కర్లతో కట్టడిచేసి 5 రన్స్ మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్ పరువు కాపాడాడు. లేకుంటే ఇంగ్లండ్‌కు మరో 2009 ఉదంతం (నెదర్లాండ్స్‌పై ఓటమి) తప్పకపోయేది!
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 184/7 (బెతెల్ 55, బ్రూక్ 53, దీపేంద్ర సింగ్ 2/23, నందన్ 2/25);
నేపాల్: 20 ఓవర్లలో 180/6 (దీపేంద్ర 44, లోకేశ్ 39, డాసన్ 2/21, జాక్స్ 1/17)