హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : ‘మన ఊరు ..మన బడి ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మరోసారి ప్రభుత్వానికి సూచించారు. బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీల భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వానికి గుత్తా లేఖ రాశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో సోమవారం మరోసారి జీరో అవర్లో సమస్యను ప్రస్తావించిన చైర్మన్, మార్చి 31లోగా బకాయిలు చెల్లించాలని సూచించారు. ప్రతి సందర్భంలో సభ నుంచి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారానికి నోచడం లేదన్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించి ఈ విషయంపై సభలో ప్రస్తావించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు గుత్తా సుఖేందర్రెడ్డి గుర్తుచేయడం గమనార్హం.