హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించిన దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ దుర్ఘటన వల్ల యావత్ భారతావని సిగ్గుతో తలదించుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్రాన్ని కోరారు. మానవత్వానికే మాయని మచ్చగా మణిపూర్ ఉదంతం మిగిలిపోతుందని పేర్కొన్నారు. మణిపూర్ బాధితులకు అండగా నిలిచి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను కోరారు.