హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): భార్యతో దిగిన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొన్నాడో వ్యక్తి. ఆ ఫొటోను డౌన్లోడ్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు.. అందులోని సదరు వ్యక్తి భార్య ఫొటోను మార్ఫింగ్ చేశారు. నగ్న ఫొటోలా తయారుచేసి, ఆమె భర్తకే పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే ‘నీ కాంటాక్టు లిస్టులో ఉన్నవాళ్లందరికీ ఫొటో ఫార్వర్డ్ చేస్తా’మని బెదిరించారు. కంగుతిన్న భర్త.. ఆ ఫొటోలు పంపవద్దని రెండు దఫాలుగా రూ.1.2 లక్షలు వాళ్లు చెప్పిన ఖాతాకు పంపాడు. ఇంకా డబ్బు డిమాండ్ చేయటంతో చిలకలగూడకు చెందిన బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తెలిసినవాళ్ల పనే కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్‌మీడియా వేదికల నుంచి ప్రొఫైల్ ఫొటోలు, డీపీల్లో మహిళల ఫొటోలు పెట్టకపోవటం మంచిదని సూచిస్తున్నారు. తెలియని వారితో చాటింగ్‌లు, ఫోన్లో మాట్లాడటం చేయవద్దని, అనుమానిత నంబర్లను బ్లాక్ చేయాలని సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు.
తుకారాంగేట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఫేస్బుక్లో లండన్‌కు చెందిన సైబర్‌నేరగాడు వైద్యుడిగా పరిచయమయ్యాడు. నాలుగు నెలలుగా చాటింగ్ చేస్తూ స్నేహితులుగా మారారు. ఇండియా టూర్ వస్తున్నానని, తన వద్ద రూ.50 వేల డాలర్లు, ఇతర బంగారు ఆభరణాలు ఉన్నాయని నమ్మించాడు. రెండు రోజులకు తనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుకొన్నారని, తనకు ఎవరూ తెలియదని నమ్మిస్తూ రూ.9.2 లక్షలు వసూలు చేశాడు. ఎయిర్‌పోర్టు బయటకు వచ్చాక ఆరోగ్యం బాగోలేదని మరిన్ని డబ్బులు వసూలు చేశాడు. మరో ఘటనలో.. ఇదే బాధితుడు రుణం కోసం దరఖాస్తు చేసుకొన్నాడు. రుణం ఇవ్వడానికి పంపిన బ్యాంకు ఖాతా సరిగాలేదని, ఆ ఖాతాను సరి చేయాలంటే కొంత సర్వీస్ చార్జీ ఇవ్వాలని రూ.2 లక్షలు స్వాహా చేశారు. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు.