భీమ్‌గల్, మార్చి 29: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగవద్దని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. వరికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో శుక్రవారం నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమంలో వేముల మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పంట కోతలు ప్రారంభమై ధాన్యం కల్లాల్లోకి వస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. భీమ్‌గల్ లాంటి ప్రాంతాల్లో చాలామంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు వడ్లు అమ్ముకున్నారన్నారని, వెంటనే ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దళారులకు వడ్లు అమ్ముకున్న వారికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. కొందరు స్వార్థం కోసం పార్టీ మారితే బీఆర్ఎస్కు వచ్చిన నష్టమేమి లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముత్యంలాంటి నిఖార్సయిన కార్యకర్తలు తమ వెంట ఉన్నారని, వారు ఎక్కడికి వెళ్లరని తెలిపారు. ఉన్న వాళ్లతోనే ప్రభుత్వంపై పోరాడుతామని, హామీల అమలుకు ఉద్యమిస్తామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెబితేనే హామీలను నెరవేర్చాలన్న భయం వాళ్లకు ఉంటుందని తెలిపారు.