చేవెళ్ల రూరల్, అక్టోబర్ 9 : దసరా పండుగకు తమకు రూ.10 వేలు మామూళ్లు ఇవ్వాలని ఓ దవాఖాన యాజమాన్యాన్ని బెదిరించిన ఐదుగురు విలేకరులపై రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో కేసు నమోదైంది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 8న శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లిన స్థానిక విలేకరులు రాజేశ్‌గౌడ్ (మనసాక్షి), సాయికిరణ్ రెడ్డి (నమస్తే జ్యోతి), ప్రతాప్ (జ్యోతి), సుధాకర్‌గౌడ్ (సూర్య వెలుగు), మల్లేశ్‌గౌడ్ (నేటి ప్రస్థానం) దసరా పండుగ మామూళ్లు రూ.10 వేలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దవాఖాన యాజమాన్యం తిరస్కరించడంతో వారు బెదిరింపులకు గురిచేశారు. దవాఖాన యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఐదుగురు విలేకరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. విలేకరుల ముసుగులో వసూళ్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
గతంలోనూ ఐదుగురు..
గతంలోనూ శంకర్‌పల్లికి చెందిన విలేకరులు ఓ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్న యజమానిని డబ్బులు ఇవ్వాలని డి మాండ్ చేయడంతో ఆయన కుమారులతో కలిసి ఆత్మహత్య చేసున్నాడు. దీంతో ఆ ఐదుగురు విలేకరులపై కేసు నమోదైంది. విలేకరుల తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.