టేకులపల్లి, మే 16 : కోయగూడెం ఉపరితలగని(కేవోసీ) నుంచి బొగ్గు రవాణా చేస్తున్న 16 టైర్ల టిప్పర్లకు లో డింగ్ ఇవ్వొద్దని కోరుతూ 12, 14 టైర్ల లారీల యజమానులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో 12, 14 టైర్ల లారీలతోనే నవభారత్, బీపీఎల్‌కు బొగ్గు రవాణా చేసేవాళ్లమని, ప్రస్తుతానికి ఇల్లెందుకు చెందిన చిట్టిబాబు అనే బొగ్గు కాంట్రాక్టర్ 16 టైర్ల టిప్పర్లు తీసుకురావడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
16 టైర్ల లారీల వల్ల తమకు 3, 4 రోజులకు ఒక్క ట్రిప్పు మాత్రమే దక్కుతున్నదని తెలిపారు. అతడే కాంట్రాక్టర్ కావడంతో సీరియల్ ప్రకారం కాకుండా డైరెక్ట్‌గా లోడింగ్‌కు వెళ్లడంతో తమకు ఒక్క లారీకి 4 ట్రిప్పులు పడుతున్నదని తెలిపారు. ఆందోళన విషయం తెలిసి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కోరారు. ఈ క్రమంలో ఓ లారీ యజమాని గుగులోత్ రవి పురుగులమందు తాగేందుకు యత్నించగా ఎస్సై రాజేందర్ అడ్డుకోవడంతో ఇద్దరి కండ్లల్లో మందు పడింది. ఎస్సైని కొత్తగూడెం దవాఖానకు, రవిని స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు.