మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? సుప్రీం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు? దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్రంగా వివరాలు ఎందుకు ఇవ్వలేదు?
High Court | హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అరెస్టు చేసే ముందు అనుస రించాల్సిన విధానాలను అమలు చేయలేదని తప్పుపట్టింది. కేబీఆర్ పార్లో వాకింగ్ చేసేందుకు వెళ్లిన పట్నం నరేందర్‌రెడ్డిని అకడ ఎలా అరెస్టు చేస్తారని నిలదీసింది. నరేందర్‌రెడ్డి ఏమైనా ఉగ్రవాది అనుకుంటున్నారా.. అని నిప్పులు చెరిగింది. నరేందర్‌రెడ్డిని చట్ట నిబంధనలకు అనుగుణంగానే అరెస్టు చేశామన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)వాదనలతో విబేధించింది. వాకింగ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేయలేదని, ఆయనను ఇంట్లోనే అరెస్టు చేశారని పీపీ చెప్పగానే.. అరెస్టు విషయాన్ని ముందుగా నరేందర్‌రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా మూడో వ్యక్తికి ఎలా ఇస్తారని నిలదీసింది. నరేందర్‌రెడ్డి పరారీలో ఉన్నారా? అరెస్టు చేసే ముందు సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదని నిగ్గదీసింది. అరెస్టు ప్రక్రియ నిబంధనలను పోలీసులు ఉల్లంఘించారని తీవ్రంగా ఆక్షేపించింది. లగచర్లలో ఫార్మా సిటీ కోసం భూసేకరణ నిమిత్తం కలెక్టర్, ఇతర అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా రైతులు తమ భూములు పోతాయనే ఆందోళనతో అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనకు తెరవెనుక కుట్రదారుడు పట్నం నరేందర్‌రెడ్డి అని తేల్చిన పోలీసులు ఆయననే ప్రథమ నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కింది కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ, నరేందర్‌రెడ్డి కేబీఆర్ పార్లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. అరెస్టు చేసే ముందు చట్ట ప్రకారం పిటిషనర్ కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదని అన్నారు. కింది కోర్టు యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులను జారీచేసిందని, వాటిని కొట్టివేయాలని కోరారు. ఈ దశలో పీపీ పల్లె నాగేశ్వర్రావు కల్పించుకుంటూ.. పిటిషనర్ నరేందర్‌రెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇంట్లోనే అరెస్టు చేసి ఉంటే ఆ సమాచారాన్ని కుటుంబసభ్యులకో లేదా ఇంట్లో ఉన్న వాళ్లకో ఇవ్వకుండా సన్నిహితుడని చెప్తున్న సలీమ్ అనే థర్డ్ పర్సన్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇలా చేయడం నిందితులను అరెస్టు చేసేందుకు అనుసరించాల్సిన నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని తప్పుపట్టింది. లగచర్ల ఘటనలో అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి తీవ్రగాయాలైనట్టు రిపోర్టు ఇచ్చిన పోలీసులు చిన్న గాయాలైనట్టు తిరిగి ఎలా రాశారని ప్రశ్నించింది. తిరిగి గండ్ర మోహన్‌రావు వాదనలు కొనసాగిస్తూ, నరేందర్‌రెడ్డిని పోలీసులు కుట్రపూరితంగా అరెస్టు చేశారని తెలిపారు. ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తే తాము భూముల్ని కోల్పోతామని రైతులు ఆందోళన చేశారని వివరించారు. లగచర్ల ఘటనకు 10 నుంచి 15 రోజుల ముందు పిటిషనర్ పట్నం నరేందర్‌రెడ్డి రైతులకు ఫోన్ చేశారని పీపీ చెప్పడంపై స్పందించిన హైకోర్టు.. పిటిషనర్ తన సన్నిహితుడికి రోజుకు ఒకటి, రెండు మించి కాల్స్ చేయలేదనే విషయం రికార్డులను పరిశీలిస్తే అర్ధం అవుతున్నదని చెప్పింది.
మెడికల్ రిపోర్టును పరిశీలిస్తే, ఘటనలో గాయపడ్డ అధికారులకు పెద్ద గాయాలు లేవని స్పష్టమవుతున్నట్టు హైకోర్టు గుర్తుచేసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో పిటిషన్‌పై తుది ఉత్తర్వులను జారీ చేస్తామన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. అయితే, భోజన విరామ సమయం తర్వాత పీపీ పల్లె నాగేశ్వర్రావు తిరిగి వచ్చి, తమ వద్ద సాక్ష్యాధారాల వీడియో ఉందని, పోలీసుల చర్యలు చట్ట ప్రకారమే ఉన్నాయని, ఈ మేరకు రాతపూర్వక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అనుమతి ఇచ్చిన న్యాయమూర్తి, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో లక్ష్మయ్య మరో ఇద్దరి వాంగ్మూలాల ఆధారంగా నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నందున ఆ వాంగ్మూలాల నివేదికలను కూడా అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. విచారణ గురువారం జరగనుంది.
‘మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు? దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్రంగా వివరాలు ఎందుకు ఇవ్వలేదు? తీవ్రగాయాలైనట్టు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్టు ఎలా రాస్తారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
‘వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనకు పిటిషనర్‌కు సంబంధం లేదు. రాజకీయ ప్రేరేపితంతోనే ఆయనపై కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 13న జారీచేసిన రిమాండ్ ఉత్తర్వులు చట్ట విరుద్ధం. బొమ్రాస్పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొడంగల్ కోర్టు యాంత్రికంగా ఆమోదించింది. ఈ నెల 2న లగచెర్ల గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి వికారాబాద్సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఎస్ఎన్ శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదులో ఆరోపణలకు, పిటిషనర్‌కు సంబంధం లేదు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేపట్టిన భూసేకరణ కోసం చేపట్టిన పబ్లిక్ హియరింగ్ సందర్భంగా..రైతులు తమ భూమి పోతుందనే భయాందోళనతో దాడి చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి, నేరాంగీకార వాంగ్మూలాల ఆధారంగా పిటిషనర్‌ను అన్యాయంగా నిందితుడిగా చేర్చారు. కింది కోర్టు కూడా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులను జారీచేసింది. ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలి. అరెసుకు ముందు పిటిషనర్ లేదా ఆయన భార్యకు కారణాలు చెప్పలేదు. ఈ నెల 13 నాటి రిమాండ్ కేసు డైరీని పరిశీలిస్తే అరెస్టుకు కారణాలు లేవు. నిందితులను పోలీసులు అరెస్టు చేసే ముందు అనుసరించాల్సిన విధివిధానాలపై డీకే బసు కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయలేదు. ప్రబీర్ పురాయస్థ వర్సెస్ ఢిల్లీ కేసులో సుప్రీంకోర్టు, నిందితుల అరెస్టుకు కారణాలు (గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ ) గురించి వివరించింది. వీటిని కూడా పోలీసులు అమలుపర్చలేదు. పోలీసుల చర్యలు ఏకపక్షంగా, దుర్మార్గంగా ఉన్నాయి. రాజకీయ కక్షతో కేసు నమో దు చేశారు. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుం డా అధికారులపై రైతులు రాళ్లు రువ్వేందుకు పిటిషనర్ ప్రోత్సహించారనే ఆరోపణలు అవాస్తవం. ఆధారాలు కూడా ఏమీ లేవు. ప్రజలు ఎవరూ కావాలని అధికారులపై దాడి చేయరు. అధికారులకు, దాడికి పాల్పడిన వ్యక్తులకు మధ్య ఎలాంటి శత్రుత్వం ఉండదు. కింది కోర్టు 13న జారీచేసిన రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలి’ అని పట్నం తరఫున న్యాయవాది టీవీ రమణారావు దాఖలు చేసిన పిటిషన్లో పేరొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 20, నమస్తే తెలంగాణ: సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి తన భర్త కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారంటూ ఆయన భార్య పట్నం శృతి హైకోర్టులో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట నిబంధనలను అమలు చేయకుండా ఏకపక్షంగా తన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను డీకే బసు కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేరొన్నదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు అమలు చేయకపోవడం కోర్టుధికారమే అవుతుందని తెలిపారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి తన భర్తను అరెస్ట్ చేసినందున పోలీసులపై చర్యలకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో ఐజీపీ వీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కే నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను ప్రతివాదులుగా పేరొన్నారు. వారిపై కోర్టు ధికరణ చర్యలు తీసుకోవాలని ఆమె తన పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించే అవకాశం ఉన్నది.