హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశంలో జరిగే 10వ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు నిర్వాహకులు ఆయనకు ఆహ్వానం పంపారు. ‘ప్రగతి కోసం శాంతి’ అనే ఎజెండాతో ఈ సమావేశాలు జరుగనున్నాయి. నోబెల్ బహుమతి గ్రహీతలు, ప్రపంచశాంతి న్యాయవాదులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
మాపై అరికో కేఫ్ ఆరోపణలు అవాస్తవం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అరికో కేఫ్ యాజమాన్యం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిపై చేసిన ఆరోపణలను ఆ శాఖ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఖండించారు. విస్కీతో ఐస్‌క్రీమ్‌ను తయారుచేసి కస్టమర్లకు, ముఖ్యంగా మైనర్లకు అమ్ముతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో ఇటీవల ఆ కేఫ్‌పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి సిబ్బందిని పట్టుకున్నామని ఆదివా రం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ కేఫ్‌లో మద్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఐస్‌క్రీమ్ తయారీకి 100 పైపర్ విస్కీని ఉపయోగించారని నిర్ధారించుకున్న తర్వాతే వారిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్ సిబ్బందికి లంచాలు ఇవ్వకపోవడమే ఈ అరెస్టులకు, కేసుల నమోదుకు కారణమని, ఎక్సైజ్ సిబ్బందే ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపారని అరికో కేఫ్ యాజమాన్యం చేస్తు న్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు.