పాలమూరుకు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జలభాండమైన శ్రీశైలాన్ని ఒక్కదెబ్బతో బలిపెట్టే పన్నాగమిది! చిక్కుముడులతో తెలంగాణను శాశ్వత దుర్భిక్షంలోకి నెట్టే దుర్నీతి ఇది. కేంద్రంలోని బీజేపీ సర్కార్, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలోని టీడీపీ సర్కార్.. మూడూ కలిసి కృష్ణాను చెరపట్టేందుకు, తెలంగాణకు ఉరి బిగించేందుకు సిద్ధమయ్యాయి. అందుకు తాడు పేనుతున్నది రేవంత్ సర్కార్. స్వయంగా కృష్ణాను ఏపీకి ధారాదత్తం చేస్తూ సొంత జిల్లాను బలిపెడ్తున్నది.. తాను పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రే!
బాబు కట్టాలనుకుంటున్న బనకచర్లకు కర్ణాటక ఒప్పుకోవాలి. కర్ణాటక కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు కావాలి. అందుకు కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు అవసరం. ఒకరికోసం ఒకరు.. రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టి, కృష్ణా నీటిని కొల్లగొట్టేందుకు చేతులు కలిపారు. ఇటు ఏపీ బాబు తరఫున రాజకీయం నెరపుతున్నదీ, అటు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ తరఫున రాయబారం నడుపుతున్నదీ రేవంత్ సర్కార్! పొరుగు రాష్ర్టాల కోసం తెలంగాణ జలహక్కుల్ని బలిపీఠం ఎక్కిస్తున్నది. తాను బుక్క తవుడు లేదుగని, పక్కనోడి నోట్లో పంచదార పోసిండట!
ఇటు జూరాలకు ఎగువన భీమాపై కర్ణాటక మూడు ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. కృష్ణాపై కొల్పూర్ వద్ద ప్రాజెక్టుతోపాటు ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నది. అటు శ్రీశైలం రిజర్వాయర్‌కు ప్రధాన ఆధారమైన తుంగభద్ర మీద కూడా కర్ణాటక మూడు కొత్త ప్రాజెక్టులకు ముగ్గుపోస్తున్నది. మంత్రాలయం వద్ద ఏపీ-కర్ణాటక ఉమ్మడిగా ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నాయి. ఇది శ్రీశైలానికి రాకముందే నీటిని దొబ్బుకుపోయే కుట్ర! ఎవరికివారు బొక్కెనలేసి కృష్ణా, తుంగభద్ర జలాలను ఎగువనుంచే ఎత్తుకుపోయే పన్నాగం! తడిబట్టతో పాలమూరు గొంతుకోసి, తెలంగాణనోట్లో మట్టిగొట్టే.. కుతంత్రం!
మరి, శ్రీశైలానికి నీళ్లు రాకుండా పోతే.. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినవా!? నీళ్లు తరలించుకుపోయేందుకు ఇప్పటికే పోతిరెడ్డిపాడు ఉండనే ఉన్నది. దానికితోడు బనకచర్ల పేరుతో గోదావరి నీటిని శ్రీశైలం పరీవాహకానికి తరలించేందుకు ఏపీ తహతహలాడుతున్నది. కేంద్రం సహకారంతో అందుకు రంగం సిద్ధం చేసింది కూడా. కాళేశ్వరాన్ని ఎండబెట్టి, గోదావరి జలాలను దిగువకు తరలిపోయేలా చేసిన రేవంత్ సర్కార్.. కృష్ణా జలాలను ఏపీ, కర్ణాటకలకు ధారాదత్తం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నది. మన హక్కుల్ని కడతేర్చి, కర్ణాటక కట్టబోతున్న సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా సీఎం రేవంత్ ఏరియల్ వ్యూలో దర్శించుకుని మరీ మురిసిపోయారు.
గట్లు గట్లు గాలికిపోతుంటే.. ఇస్తరాకు నాదే అన్నడట! కృష్ణా నీటిలో వాటా కోసం కొట్లాడాల్సిన ప్రభుత్వం.. ప్రాజెక్టుల వారీగా టీఎంసీల కోసం దేవులాడుతున్నది. నిరుడు బనకచర్ల విషయంలో వ్యవహరించినట్టుగానే ఇప్పుడూ చేస్తున్నది. పాలమూరు కోసం పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ ప్రకటిస్తే.. చర్చలు, ఒప్పందాలంటూ డైవర్షన్‌ను మొదలుపెట్టింది.
జూరాలను జుర్రేసి, శ్రీశైలాన్ని నిర్జలభూమిగా మార్చే కుట్ర అమలైతే తెలంగాణ పరిస్థితి ఏమిటి? ఏండ్లకేండ్లు కరువులతో వలసలపాలైన తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఏమిటి? ఒక్క వేటుతో పాలమూరు-రంగారెడ్డి అవుట్! శ్రీశైలం అవుట్! జూరాల అవుట్! ఆర్డీఎస్, సుందిళ్ల, పాలమూరు ప్రాజెక్టులు అవుట్! తెలంగాణ గుక్కెడు నీటికి గుక్కపట్టి ఏడ్వాల్సి వస్తది! చుక్కనీటి కోసం పైకి, కిందికి వెర్రిచూపులు చూడాల్సి వస్తుంది. దక్షిణ తెలంగాణ శాశ్వత దుర్భిక్షంలోకి జారుకుంటుంది.
హస్తిన కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా బనకచర్లకు మార్గం సుగమం చేసేందుకు కేంద్రంతో కలిసి చంద్రబాబు జలకుట్రలు. బనకచర్లకు తెలంగాణ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపులకు ఏపీ ఎన్వోసీ ఇస్తుందంటూ కేంద్రం లీకులు.
ముఖ్యమంత్రి మారారు.. మంత్రివర్గం ఇంకా కుదురుకోలేదు.. అందునా ఒక మంత్రి రాజీనామా చేయడంతో రాజకీయ ప్రకంపనలు. అయినా తెలంగాణతో కలిసి తుంగభద్ర, భీమా ఉపనదులపై బ్యారేజీ-కమ్-బరాజ్‌లు కట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం హడావుడి.
రెండున్నరేండ్లపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావుపెట్టి, తట్టెడు మట్టి ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వానికి అకస్మాత్తుగా పాలమూరుపై ప్రేమ. కర్ణాటకతో చర్చలు కొలిక్కి రాకుండానే బ్యారేజీ-కమ్-బరాజ్‌లపై ఏరియల్ సర్వే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తే బనకచర్లపై ఆలోచిస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటన. తెలంగాణకు అదో శుభవార్తగా అభివర్ణన.
(గుండాల కృష్ణ – మ్యాకం రవికుమార్)
తెలంగాణకు ప్రాణ, జీవధారలైన కృష్ణా-గోదావరి జలాల్లో అసలేం జరుగుతున్నది? కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకొన్న కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వైపు రెండున్నరేండ్లుగా కన్నెత్తిచూడని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత కొన్నిరోజులుగా ఆ ప్రాజెక్టుల గురించి ఎందుకు హడావుడి చేస్తున్నది? ప్రజలు ఇచ్చిన అధికార గడువులో సగం కాలం ఏ ఒక్క ప్రాజెక్టులోనూ ఇటుక పేర్చని కాంగ్రెస్.. ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టులను పూర్తిచేస్తానంటూ ఆర్భాటపు ప్రకటనలు ఎందుకు చేస్తున్నది? మరోవైపు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కనాడూ ఆల్మట్టి ఎత్తు పెంపుగానీ తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల వైపు తొంగిచూడని కర్ణాటక ప్రభుత్వం కొన్నిరోజులుగా ఒకటెనక మరొక ప్రతిపాదనలను తెరపైకి ఎందుకు తెస్తున్నది? రాష్ట్రంలో 90శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో.. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయని తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకతో కలిసి బరాజ్‌లు కట్టేందుకు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నది? పాలమూరు పాదయాత్ర చేస్తామని బీఆర్ఎస్ చెప్పడంతో నిన్నటిదాకా బనకచర్లపై మౌనం వహించి, ఇప్పుడు ఏపీ ఎన్వోసీ ఇస్తే బనకచర్లకు అంగీకరిస్తామంటూనే త్వరలో శుభవార్త వింటారనే సంకేతాలు ఎందుకు ఇచ్చారు? అత్యంత కీలకమైన అంశం.. కృష్ణాలో 750 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ ముగింపు దశలోకి వచ్చిన ఈ తరుణంలో నీటి కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందానికి ఎందుకు సిద్ధమైంది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హస్తిన వేదికగా రచించిన బనకచర్ల జలకుట్రల గుట్టు విప్పితేనే వీటన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. మోదీ ప్రభుత్వం జుట్టు తన చేతుల్లో ఉన్నందున రూ.80 వేల కోట్ల బనకచర్ల ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు, నిధులు తెచ్చుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు ఆడుతున్న కీలుబొమ్మలాటలో భాగంగానే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా బనకచర్లతో గోదావరి జలాలకు మాత్రమే ఎసరు పెడుతున్నారని అనుకొంటే, ఇప్పుడు కృష్ణాజలాలను పణంగా పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఊపిరిపోసే జూరాల, శ్రీశైలం జలాశయాలకు చుక్క నీరు రాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తయారుచేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తున్నది. నోటితో నవ్వి.. నుదుటితో వెక్కిరించినట్టు! పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల అనుమతుల్ని సాధిస్తున్నామనే అశాస్త్రీయ, అనాలోచిత, అవగాహనా రాహిత్య సాకుతో ఏకంగా దక్షిణ తెలంగాణకు ఉరి వేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది.
కుట్రలను ముందే చెప్పిన ‘నమస్తే’
ఏపీ సీఎం రగిలించిన బనకచర్ల చిచ్చుపై తెలంగాణ సమాజం ఒక్కసారిగా కన్నెర్ర జేయడంతో తెరమీద హడావుడి తగ్గింది. కానీ గుట్టుచప్పుడు కాకుండా బాబు బృందం ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. మరోవైపు రెండున్నరేండ్లుగా అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్ని పడావు పెట్టిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొంతకాలంగా హడావుడి మొదలుపెట్టింది. మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు చేస్తామని ప్రకటించి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై వరుస సమీక్షలు నిర్వహించింది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాజెక్టును పరిశీలించారు. దీనికి కొనసాగింపుగా పచ్చ మీడియాలో లీకుల కథనాలు పురుడు పోసుకున్నాయి. బనకచర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 88 టీఎంసీలతో చంద్రబాబు పచ్చజెండా ఊపేలా కేంద్ర జలసంఘం ఆఫర్ ఇచ్చిందని, ఇందుకు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయనేది ఆ కథనాల సారాంశం. దీంతో ఈ కుట్రల గుట్టును విప్పుతూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ఇచ్చింది. బనకచర్లకు మార్గం సుగమం చేసేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రాజెక్టులపై ప్రేమ ఒలకబోసిందని ప్రజల ముందు ఉంచింది. దీనిపై ప్రభుత్వ పెద్దలెవరూ నోరు విప్పలేదు. అయితే పాలమూరు-రంగారెడ్డి పథకం పనుల పరిశీలన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ‘నమస్తే’ కథనం వాస్తవమని నిర్ధారించే వ్యాఖ్యలు చేశారు. త్వరలో శుభవార్త వింటారని చెప్పారు. అంటే తెలంగాణకు దక్కాల్సిన 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల రూపంలో చంద్రబాబు తన్నుకుపోయేందుకు మోదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రంగం సిద్ధమైందనేది స్పష్టమవుతున్నది.
‘పాలమూరు’కు వచ్చే అదనపు మేలేంటి?
సీఎం రేవంత్‌రెడ్డి తాజా పర్యటనలో చెప్పిన ప్రకారమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కనీసం మరో ఏడాది పడుతుందనేది స్పష్టమైంది. అన్నీ అనుకూలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఉద్దండాపూర్ దాకా కృష్ణాజలాలు వస్తాయి. ఈ నేపథ్యంలో బనకచర్లకు తలూపితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటని సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నది. కృష్ణాలో తెలంగాణకు 750 టీఎంసీల కేటాయింపులు సాధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. మరో ఏడాదిలో ట్రిబ్యునల్ విచారణ ముగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసుకోవచ్చు. అందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 కాకపోతే భవిష్యత్తులో పెరిగే తాగు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా 120 టీఎంసీలు కేటాయించుకొనే స్వేచ్ఛ, వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆడించినట్టు ఆడుతూ పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతికి ఏపీ నుంచి ఎన్వోసీ తీసుకొంటే, ఆ ఎన్వోసీని ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు పెట్టే ప్రమాదం ఉన్నది. తద్వారా పాలమూరు ప్రాజెక్టును కేవలం 90 టీఎంసీలకే పరిమితం చేయడంతో భవిష్యత్తులో కేటాయింపుల్ని పెంచుకొనే అవకాశం చేజారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల ప్రక్రియను మనం చేజేతులా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినట్టవుతుందని ఆవేదన చెందుతున్నారు.
చివరి దశలో ఇలా..
తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన అంశం కృష్ణాజలాల్లో జరిగిన అన్యాయం. అందుకే కృష్ణాజలాల్లో తెలంగాణ కేటాయింపుల్ని పెంచుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వంపై ఏండ్ల తరబడి ఒత్తిడి తెచ్చి, సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడింది. చివరికి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రూపంలో న్యాయమైన వాటా దక్కుతుందనే ఆశాభావంతో తెలంగాణ సమాజం ఉన్నది. పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగిస్తున్నది. పుష్కరకాలంగా సాగుతున్న ట్రిబ్యునల్ విచారణ చివరి అంకానికి వచ్చింది. 750 టీఎంసీల కేటాయింపుల్ని సాధిస్తామంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఆంధ్రప్రదేశ్‌తో రాజీ పడటమనేది డేంజర్గేమ్గా సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపులకు ఏపీ ఎన్వోసీ ఇస్తే, ఆ పత్రాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. తద్వారా ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న సమయంలో రెండు రాష్ర్టాలు ఒప్పందాలు చేసుకొంటే ఇక మాకేం పని అని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేతులెత్తేసి! మిగిలిన జలాలపైనా ఇదేరీతిలో రాజీ చేసుకోవాలంటూ ఉచిత సలహా పడేస్తే!! దశాబ్దాలుగా తెలంగాణ సమాజం కన్నకలలు, పెట్టుకొన్న ఆశలకు సమాధి కట్టినట్టు కాదా! అని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి కేటాయింపుల్ని సాధించుకోవడమనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు తప్ప.. అది పొరుగు రాష్ట్రంతో పెట్టుకొనే కయ్యం కాదు.. శాస్త్రీయ వాదనలతో వాటాలు సాధించాలే గానీ ఇలా తాత్కాలిక ఒప్పందాలతో శాశ్వత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని సాగునీటిరంగ నిపుణులు ఒకరు వివరించారు.
ట్రిబ్యునల్ మనుగడ ఎలా సాధ్యం?
బచావత్ అవార్డు మేరకు గోదావరి జలాల్లో ఏపీకి వచ్చే వాటాల ప్రకారం ఆ రాష్ట్రం ఇప్పటికే సంపూర్ణంగా ప్రాజెక్టుల్ని కట్టుకొన్నది. వినియోగం కూడా దాదాపుగా అదేస్థాయిలో ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు. అంటే బనకచర్లకు తెలంగాణ అంగీకరించినట్టయితే కేంద్రం 200 టీఎంసీల నికరజలాలను కేటాయిస్తుంది. అంటే గోదావరిలో ఏపీ కేటాయింపుల పరిమాణం 516 నుంచి 716 టీఎంసీలకు పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ వాటా కూడా పెరుగాలి. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం స్వయంగా తమకు గతంలో కేటాయించిన 968 టీఎంసీలు ఉంటే చాలు! అని అంగీకరిస్తున్నది. దీంతో ట్రిబ్యునల్ అవార్డు చేసిన కేటాయింపులకు విఘాతం కలిగి.. బచావత్ అవార్డు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అంతేకాదు.. దేశంలో ఎక్కడాలేని విధంగా, చివరకు అంతర్జాతీయ జల ప్రమాణాలకూ అంతుబట్టని సముద్రంలో కలిసే జలాల వినియోగం అని చంద్రబాబు ప్రతిపాదిస్తే, తాజాగా శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం దానినే పునరుద్ఘాటించింది. మరి అదే నిజమైతే… గోదావరి బేసిన్‌లోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ర్టాలు కూడా మున్ముందు సముద్రంలో వేల టీఎంసీలు కలుస్తున్నందున అందులో కొంత తాము వాడుకొంటామంటూ ప్రాజెక్టులకు అనుమతులు కోరుతారు. అంతెందుకు.. గోదావరి-కావేరీ అనుసంధానం అంటూ హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇదే ప్రాతిపదికన రేపు వందల టీఎంసీల గోదావరి జలాల్ని తమిళనాడుకు మళ్లించేందుకు బనకచర్ల ఒక ప్రాతిపదిక అవుతుంది. సముద్రంలో కలిసే జలాల సూత్రానికి ఇప్పుడు తెలంగాణ తలూపితే… రేపటినాడు ఇతర రాష్ర్టాలు సుప్రీంకోర్టుకు వెళ్లి దీనిని ఒక ఉదాహరణగా చూపుతాయి. ట్రిబ్యునల్స్ ముందు వాదనల్లోనూ దీనిని వాడుకొంటే తదుపరి పరిణామాలకు బాధ్యలెవరు? అని సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటకను సంతృప్తిపరిచే పనిలో రేవంత్ సర్కార్?
చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న తెలంగాణతోపాటు కర్ణాటక ప్రభుత్వ అనుమతి కూడా ముఖ్యమే. కానీ అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ నేరుగా సంప్రదింపులకు దిగి ఒప్పించే పరిస్థితి లేదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కూడా ఆ దిశగా నేరుగా ప్రయత్నాలు చేసే అవకాశం లేదు. అందుకే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారనే ప్రచారం జరుగుతున్నది. బనకచర్లకు కర్ణాటక అనుమతి ఇవ్వాలంటే ఆ రాష్ర్టానికి తాయిలాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులో కర్ణాటక వాటా 16 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా ఆ రాష్ట్రం బెడ్తి-హీరెవడ్డెటి లింక్ కింద 16 టీఎంసీల తుంగభద్ర జలాలు వాడుకొనేందుకు కేంద్రం నుంచి అనుమతులు ఇస్తారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నది. కానీ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్-2 అవార్డు అమలుపై సుప్రీంకోర్టు స్టే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో భాగస్వామ్య రాష్ర్టాలను ఒప్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే ఒకసారి రాష్ర్టాలతో సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఇక.. తుంగభద్ర జలాల అదనపు వినియోగంతోపాటు భీమా జలాల వినియోగం కోసం బ్యారేజీ-కమ్-బరాజ్‌లకు తెలంగాణ సహకారం కావాల్సి ఉన్నది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదే చేస్తున్నది. ఇందులో కొన్ని నిర్మాణాల వల్ల తుమ్మిళ్ల, జూరాల ఆయకట్టుకు గడ్డుకాలం వచ్చే ప్రమాదం ఉన్నదని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా ముందుకుపోతున్నది. వీటన్నింటి వెనుక చంద్రబాబు బనకచర్ల తంత్రమే ఉన్నదనేది బహిరంగ రహస్యంగా పలువురు అభివర్ణిస్తున్నారు.
చంద్రబాబు రూపొందించిన ప్రతిపాదనలు
‘సమ్మక్క బరాజ్ దగ్గర తెలంగాణ 47 టీఎంసీల నీటి హక్కును వదులుకోవాలి. గోదావరి-కావేరిలో ఏపీకి హక్కుగా వచ్చే 45 టీఎంసీలు, కర్ణాటక వాటా 16 టీఎంసీలు (ఇందుకు బదులుగా కర్ణాటకకు బెడ్తి-హీరెవడ్డెటి లింకు కింద 16 టీఎంసీల సర్దుబాటు), ఏ రాష్ట్రం వాడుకోని 15 టీఎంసీలు, తమిళనాడు వాటా మరో 44 టీఎంసీలు… ఇలా మొత్తం 167 టీఎంసీలను గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు కేటాయిస్తారు. ‘గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం) నుంచి 47 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్ జలాశయానికి తరలిస్తారు. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకొంటుంది. సమ్మక్క బరాజ్ దగ్గర 47 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వదులుకొంటున్నందున పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 43 టీఎంసీలకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన మరో 45 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డికి కేటాయించేందుకు ఏపీ ఎన్వోసీ ఇస్తుంది.
తెలంగాణకు వచ్చేదెంత? పోయేదెంత??
తెలంగాణకు వచ్చేది: కేవలం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 88-90 టీఎంసీల నీటి కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్వోసీ ఇస్తారు. ఈ కేటాయింపులు తెలంగాణకు కృష్ణాజలాల్లో ఉండే హక్కుకు లోబడే ఉంటాయి. కానీ అదనపు కేటాయింపులు కావు.
తెలంగాణకు పోయేవి: గోదావరి జలాల్లో భాగంగా సమ్మక్క బరాజ్ వద్ద 47 టీఎంసీల హక్కును వదులుకోవాలి. పైగా సమ్మక్క బరాజ్ నుంచి నేరుగా నాగార్జునసాగర్‌కు గోదావరి జలాలను తరలిస్తారు. ఆపై ఒకవైపు కేంద్రం గోదావరి-కావేరి అనుసంధాన రూపంలో 167 టీఎంసీలు తరలించుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల రూపంలో మరో 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోతారు.
రేవంత్ సర్కార్ దాగుడు మూతలు!
కర్ణాటక రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల అంశంలో తెలంగాణలోని రేవంత్ సర్కార్ దాగుడు మూతలు ఆడుతున్నదని ఇంజినీరింగ్ వర్గాలే విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. కర్ణాటక ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఏమిటనేది తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లకు సైతం తెలియడం లేదు. వాస్తవంగా నదీజలాల హక్కులు, ట్రిబ్యునల్ అవార్డులు, వినియోగం, సమస్యలు తదితర అంశాలపై ఇరిగేషన్ శాఖలో అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం ప్రత్యేకంగా ఉన్నది. పొరుగు రాష్ర్టాలు చేపట్టే ప్రాజెక్టుల వల్ల రాష్ర్టానికి వాటిల్లే ప్రమాదాలు, నదీజల ప్రవాహాలపై పడే ప్రభావాలు, అవార్డులకు అనుగుణంగా ఉన్నదా? లేదా? తదితర సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ ఆ విభాగం అధికారులే పర్యవేక్షిస్తారు. అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ, కర్ణాటక ప్రతిపాదించిన బరాజ్‌లకు సంబంధించిన వివరాలేవీ ఆ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఎన్ని టీఎంసీలతో, ఏ జలహక్కులతో కర్ణాటక ప్రతిపాదిస్తున్నదో? తెలియదని ఇంటర్‌స్టేట్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంటర్‌స్టేట్ విభాగం అధికారులను రాష్ట్రసర్కార్ పెద్దలు భాగస్వామ్యం చేయకపోవడం గమనార్హం. అధికారులకు తెలియకుండానే, అభిప్రాయాలను తీసుకోకుండానే కర్ణాటక ప్రభుత్వంతో కలిసి చర్చలు చేపట్టింది. ఇటీవల రాష్ట్రంలోని ఓ మంత్రిని ఆహ్వానించడం, తాజాగా ముఖ్యమంత్రి సైతం జిల్లాలో పర్యటించి సర్వేలకు పూనుకోవడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడిదే విషయమై రాష్ట్ర ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాడే వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కార్
కర్ణాటక సర్కార్ ప్రతిపాదనలను ఆదిలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దంద్వంగా వ్యతిరేకించింది. నావలి రిజర్వాయర్ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపాలని కోరుతూ 2022లో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అప్పటి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక లేఖ రాశారు. నావలి రిజర్వాయర్ ప్రతిపాదలను సానుకూలంగా ఆమోదించాలని కోరారు. ఆ రిజర్వాయర్ విస్తరణ తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని నాటి బీఆర్ఎస్ సర్కా ర్ కర్ణాటకకు తేల్చిచెప్పింది. తుంగభద్ర బోర్డు సమావేశంలోనే నావలి రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక రాష్ట్ర ప్రభు త్వం చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చిం ది. ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి వచ్చేంతవరకూ ఆ ప్రాజెక్టుపై ముం దు కు పోవద్దని తేల్చిచెప్పింది. బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్రపై అనేక షరతులు విధిస్తూ 230 టీఎంసీలు కేటాయించిందని గుర్తుచేసింది. ట్రిబ్యునల్-2 అవార్డు వచ్చేంతవరకూ తుంగభద్ర బేసిన్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పింది. ఏపీ ప్రతిపాదనలనూ తీవ్రం గా వ్యతిరేకించింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కార్ ఆ ఒప్పందాల కోసం ఇప్పుడు ఉరకలేస్తుండటం చర్చనీయాశంమైంది.
నావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
పూడిక కారణంగా తుంగభద్ర డ్యామ్‌లో 55.28 టీఎంసీలు నష్టపోవాల్సి వస్తున్నదని చెప్తున్న కర్ణాటక.. లోలెవల్ కెనాల్‌కు సమాంతరంగా మరో కాలువ తవ్వేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 31 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన నావలి రిజర్వాయర్‌ను 52టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. చిక్కాలపర్వి
తుంగభద్ర నదిపై చిక్కాలపర్వి
వద్ద రూ.397.5 కోట్లతో 0.43టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రోడ్ కమ్ బరాజ్ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఏపీలోని మంత్రాలయానికి రోడ్డు మార్గం ఏర్పడుతుంది. బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలకు కేంద్రం సైతం ఆమోదం తెలిపింది.
గుండ్రేవుల బరాజ్
తుంగభద్రపై కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద ఏపీ ప్రభుత్వం 10టీఎంసీలతో బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదించింది. అందులో 4టీఎంసీలను వాడుకునే అవకాశమిస్తామని తెలంగాణకు సైతం ఆశజూపింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. తెలంగాణకు తీరని నష్టమని తేల్చిచెప్పింది. ఏపీ ప్రతిపాదనలను పక్కకునెట్టి ఆర్డీఎస్ కోసం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను నిర్మించింది.
ఆల్మట్టి ఫేజ్-3
కర్ణాటక ప్రతిపాదించిన యూకేపీ ఆల్మట్టి ఫేజ్-3 (అప్పర్ కృష్ణా ప్రాజెక్టు)కు బ్రిజేశ్ ట్రిబ్యునల్ 130 టీఎంసీలను కేటాయించింది. ఆ జలాల వినియోగానికి ఆల్మట్టి ఎత్తును 519.6మీటర్ల నుంచి 524.256మీటర్లకు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. తద్వారా ఆల్మట్టి ప్రస్తుత నీటిమట్టం 123.08టీఎంసీలకు అదనంగా మరో 100టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ పెరుగుతుంది. అయితే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే ఆల్మట్టి ఎత్తుపెంపును చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది.
కొల్పూర్ వద్ద బరాజ్..
కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ స్పిల్‌వేకు దిగువన కొల్పూర్ వద్ద 1 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో కొత్తగా బరాజ్‌ను ప్రతిపాదించింది. తాగు, సాగునీరు, లిఫ్ట్ చేపట్టాల నేది ప్లాన్. 332 మీటర్ల పూర్తిస్థాయి జలాశయ మట్టం వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధంచేసింది. సంయుక్తంగా నిర్మించేందుకు తెలంగాణ సర్కార్‌తో కలిసి సన్నాహాలు చేస్తున్నది.
కురుమర్తి బరాజ్
కృష్ణా, భీమా నదులు తంగిడి వద్ద కలుస్తాయి. దాని ఎగువన భీమా నదిపై కురుమర్తి గ్రామం వద్ద తెలంగాణతో కలిసి సంయుక్తంగా బరాజ్ నిర్మాణానికి కర్ణాటక తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
హర్యాల్ బ్రిడ్జ్-కమ్-బరాజ్
కర్ణాటక లోని కలబురిగి జిల్లాజేవర్గి తాలూకాలో భీమా నదిపై హర్యాల్ వద్ద బ్రిడ్జి కమ్ బరాజ్‌ను ప్రతిపాదించింది. రూ. 104కోట్ల నిర్మాణ అంచనా బ్రిడ్జి కమ్ బరాజ్ నిర్మాణానికి టెండర్‌ను సైతం జారీ చేసింది.
గుర్జాపూర్ గేటెడ్ బరాజ్
భీమా నదిపై కొల్పూర్ బరాజ్‌కు సుమారు 10నుంచి 15 కిలోమీటర్ల ఎగువన రాయచూర్ తాలూకాలో గుర్జాపూర్ గ్రామం సమీపంలో 336మీటర్లు ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదన. రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్‌కు నిరంతర నీటి సరఫరా దీని లక్ష్యం.
సొన్నా బరాజ్
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో భీమా నదిపై 3.6 టీఎంసీల నిల్వసామర్థ్యంతో బరాజ్ నిర్మాణానికి ప్రతిపాదన. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం మొత్తంగా బరాజ్ నుంచి 6 టీఎంసీలు వాడుకునే అవకాశమివ్వాలంటూ కేంద్రం ముందు ప్రతిపాదించిన కర్ణాటక.
త్వరలో శుభవార్త చెప్తా!
త్వరలో తెలంగాణ ప్రజలకు శుభవార్త అందిస్తా. డిసెంబర్‌లోపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు, 90 టీఎంసీలకు వాళ్లమీద ఒత్తిడి తచ్చునా, కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్వోసీ తెచ్చే బాధ్యత నాది. డిండి ప్రాజెక్టుకు 20-30 టీఎంసీలకు అనుమతి తెచ్చే బాధ్యత కూడా నాదే. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్వోసీ ఇస్తే బనకచర్లపై ఆలోచిస్తా!పూర్తయిన పాలమూరు-రంగారెడ్డికి ఎన్వోసీ అవసరమేంది? కృష్ణాలో నీటి వాటా వదిలేసి, ప్రాజెక్టుల వారీ దేబరింపులేంది?
అర్థమయ్యేందుకే రెండేండ్లు!
17 ఏండ్లుగా జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ నాయకుడిగా పనిచేసి పాలమూరులో తిరిగినా.. ఈ జిల్లాపై అవగాహన వచ్చేందుకు రెండేండ్లయింది. ఏది ఎక్కడున్నదో సరి చూసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొద్దామని అనుకుంటే.. రాజకీయ కార్యాచరణ చేస్తామని బీఆర్ఎస్ వాళ్లు బయలుదేరిండ్రు. ప్రాజెక్టులపై అవగాహన లేకపోవడం తప్పుకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు నష్టం చేకూర్చే నిర్ణయాలు మాత్రం తప్పు!
పక్కింట్లో కోడి.. మనకు పప్పన్నం!
ఏపీ వాళ్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకువచ్చి బనకచర్లలో పోసుకుంటరా? నల్లమల సాగర్‌లో పోసుకుంటరా? అనేది మన సమస్య కాదు.. మన కేటాయింపులు మనకు కచ్చితంగా రావాలి. వాళ్లేం చేస్తున్నరో మనకెందుకు?.. పక్కింట్లో కోడిని కోసుకున్నరా? కుందేలు కోసుకున్నరా మనకెందుకు? మనకు పప్పన్నం అన్న సక్కగున్నదా.. లేదా? సక్కదిద్దుకోవాలి.. పక్కింట్లో కోడికూర వాసన వస్తున్నదని చెప్పి వాడి ఇంటి మీద బురద పోస్తరా?
సముద్రంలోకి వెళ్లే నీళ్లయినా ఎగువ రాష్ర్టాలకు హక్కులుంటయ్! ఏపీ కోసమే కాళేశ్వరాన్ని ఎండబెట్టినమని ఒప్పుకొంటున్నట్టేనా?
జవాబు లేదు!
‘కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిండు. అక్కడ కొత్త క్యాబినెట్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ పదవీకాలం ఇంకా రెండేండ్లే ఉన్నది. ట్రిబ్యునల్ విచారణ పూర్తికాలేదు. మరి నీటివాటా సాధనకు ఎట్ల ముందుకుపోతరు?
– సీఎంకు ఓ విలేకరి ప్రశ్న
2034 దాకా తానే సీఎం అని పదే పదే చెప్పే రేవంత్.. రెండేండ్లలో ఏం చేస్తరంటే మాత్రం సమాధానం కరువు!