హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ కోస్గి. రాష్ట్రంలోనే తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ. పైగా సీఎం నియోజకవర్గంలోని కాలేజీ ఇది. ఈ కాలేజీని నడుపలేమని, తమ వల్ల కాదని సర్కార్ చేతులెత్తేసింది. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఈ కాలేజీని జేఎన్టీయూహెచ్కు బదలాయించేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీగా వ్యవహరించనున్నారు. ఇదే జేఎన్టీయూ కాన్స్టియంట్ కాలేజీ పేరుతో సీట్లు భర్తీచేస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేసింది. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి ఇంజినీరింగ్ కాలేజీ ఇదే.
మరో 10 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలు సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కానీ కాలేజీల ఏర్పాటుకు బ్రేక్‌లు పడ్డాయి. ఆ తర్వాత ఉన్న ఒక్క కాలేజీని నడుపలేమంటూ సాంకేతిక విద్యాశాఖ అశక్తతను వ్యక్తంచేసింది. జేఎన్టీయూకు అప్పగించడంలో భాగంగా సర్కార్ జేఎన్టీయూహెచ్ నుంచి ప్రతిపాదనలు కోరింది. భవనాలు, ల్యాబ్స్, రూ. 100కోట్లు, 40 వరకు టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు మంజూరు చేయాలని జేఎన్టీయూ సర్కార్‌ను అభ్యర్థించింది. 516 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని కోరింది. జేఎన్టీయూ పాలేరు, మహబూబాబాద్, సిరిసిల్ల కాలేజీలు అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
చేరినవారు వెనక్కి..
కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ, సీఎస్ఈ ఏఐఎంఎల్, సీఎస్ఈ డాటా సైన్స్ వంటి మూడు కోర్సులు ప్రవేశపెట్టారు. ఒక్కో బ్రాంచిలో 60 చొప్పున 180 సీట్లున్నాయి. మొదటి బ్యాచ్‌లో 140 మంది చేరగా, రెండో బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య 80కి పడిపోయింది. కొందరు కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది.. ఆ తర్వాత రద్దుచేసుకుని, ఇతర కాలేజీల్లో చేరుతున్న ఉదంతాలున్నాయి.