తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం!
తమ్మిడిహట్టి బరాజ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో, మీడియా సమావేశాల్లో, బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలివి.
- మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి
- 152 మీటర్ల ఎత్తు కోసం మహారాష్ట్రతో చర్చలు
- 148 మీటర్లకు మించి కట్టేందుకు ససేమిరా
- ఆశించిన నీటి లభ్యత లేదని తేల్చిన సీడబ్ల్యూసీ
- దీంతో సాంకేతిక కమిటీలతో కేసీఆర్ చర్చలు
- అధికారులు, కేంద్ర సంస్థలతో అధ్యయనాలు
- చివరికి 148 మీటర్లకు ఇరురాష్ర్టాల ఒప్పందం
- మేడిగడ్డను పడావు పెట్టి, కరువును తెచ్చిన కాంగ్రెస్
- విమర్శల నేపథ్యంలో మళ్లీ తమ్మిడిహట్టి రాగం
‘కాంగ్రెస్ నాయకులు జలయజ్ఞం పేరిట తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కడుతామని కథలు చెప్పారు. అసలు ఆ మూలస్థానంలో నీళ్లున్నయా అని ఒకనాడైనా ఆలోచించారా? నదిలో నీటి లభ్యత లేనప్పుడు, వేల కోట్ల ప్రజాధనాన్ని పోసి చేవెళ్ల, రంగారెడ్డిలో వేల కిలోమీటర్ల కాలువలు ఎందుకు తవ్వారు? కేవలం కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు దోచిపెట్టి జేబులు నింపుకోవడానికే తప్ప, ఆ డిజైన్‌లో రైతులకు నీళ్లిచ్చే చిత్తశుద్ధి ఏనాడైనా ఉన్నదా?’
‘మహారాష్ట్ర ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ల గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో వేలాది ఎకరాల అడవులు, గిరిజన పల్లెలు మునిగిపోతాయని కరాకండిగా చెప్పారు. 148 మీటర్ల కంటే ఒక అంగుళం కూడా పెంచనివ్వబోమని తెగేసి చెప్పారు. 148 మీటర్ల వద్ద కడితే అకడ దొరికేది ఎంత? సెంట్రల్ వాటర్ కమిషన్ లెకల ప్రకారమే అకడ లభించేది కేవలం 40 నుంచి 50 టీఎంసీలు మాత్రమే.
ఆ అరకొర నీటితో యావత్ తెలంగాణ దాహాన్ని, కోటి ఎకరాల సాగునీటి అవసరాలను ఎలా తీర్చగలం? అందుకే మేం ఇంజినీరింగ్ డాటా తెప్పించి శాస్త్రీయంగా పరిశీలించాం. మేడిగడ్డ వద్ద ఏటా 280 నుంచి 300 టీఎంసీల నీటి ప్రవాహం నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందుకే మేడిగడ్డను ప్రాజెక్టుకు గుండెకాయగా మార్చాం. అలాగని మేం తమ్మిడిహట్టిని వదిలేయ లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు 148 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్పాం. మిగతా తెలంగాణ మొత్తానికి మేడిగడ్డ ద్వారా నీళ్లిచ్చేలా సమగ్ర గ్రిడ్‌ను సిద్ధం చేశాం.’
‘గత పాలకులు పొరుగు రాష్ట్రాలతో పేచీలు పెట్టుకొని కోర్టులు, కేసులతో ప్రాజెక్టులను ఏండ్ల తరబడి మూలనపడేశారు. కానీ మేం మహారాష్ట్ర ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వాళ్ల భూములు మునగకుండా ఒప్పందం చేసుకొని సమస్యను శాశ్వతంగా పరిషరించాం. ఇప్పుడు కొందరు మళ్లీ అవగాహన లేకుండా తమ్మిడిహట్టి వద్దే 152 మీటర్లతో కడుతామని ప్రగల్భాలు పలుకుతున్నరు. మహారాష్ట్ర ఒప్పుకొంటుందా? కోర్టులకు వెళ్లి స్టే తేవడం తప్ప.. అకడ ఏం చేయగలరు? 148 మీటర్లతో కడితే మిడ్‌మానేరు దాకా 200 టీఎంసీల నీటిని ఎలా తరలిస్తారు? రాజకీయ కక్షతో ప్రాజెక్టులను ధ్వంసం చేసి, నీళ్లు లేని తమ్మిడిహట్టి వైపు మళ్లీ వెళ్లడం చారిత్రక తప్పిదం తప్ప మరొకటి కాదు.’
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్(ఫుల్ రిజర్వాయర్ లెవల్)తో బరాజ్ నిర్మించి తీరుతామని, గ్రావిటీ ద్వారా నీళ్లను తరలిస్తామని కాంగ్రెస్ పదే పదే చెప్తున్నది. తాజాగా మహారాష్ట్రతో చర్చలు అంటూ ఊదరగొడుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్రను ఒప్పించలేదని ఆరోపణలకు దిగుతున్నది. కానీ వాస్తవమేమిటంటే తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి మాజీ సీఎం కేసీఆర్ విశేష కృషిచేశారు. ప్రాజెక్టుకు సంబంధించి అనేక సాంకేతిక చర్చలు జరిపారు. సంస్థలు, విశ్రాంత ఇంజినీర్లతో అధ్యయనాలు చేయించారు. మహారాష్ట్రతో సంప్రదింపులు కొనసాగించారు.
తుది నిమిషం వరకు 152మీటర్లతో బరాజ్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగారు. ముంపుపై మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోపాటు, 148మీటర్లకు మించి ఒప్పుకోబోమని తెగేసి చెప్పడంతో ప్రాజెక్టు రీడిజైన్‌కు మొగ్గుచూపారు. బరాజ్ ప్రతిపాదిత ప్రాంతంలో నీటిలభ్యత అంశాలపై అభ్యంతరాలు కూడా వచ్చాయి. దీంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా విభజించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన 2లక్షల ఆయకట్టు కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించారు. అదేవిధంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని మిగతా ఆయకట్టుకు నీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కానీ కాంగ్రెస్ తమ్మిడిహట్టి వద్ద బరాజ్ అంటూ ఊదరగొట్టడమేకాకుండా, చర్చల పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. వార్ధా ప్రాజెక్టును పక్కనపెట్టి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయాన్ని తలపెట్టింది.
ఇదీ కేసీఆర్ చేసిన కృషి
- ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో బరాజ్ నిర్మించాల్సి ఉన్నది. తద్వారా 160 టీఎంసీల జలాలను మళ్లించాలనేది లక్ష్యం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోకుండానే బరాజ్, ఇతర హెడ్ రెగ్యులేటరీ నిర్మాణాలను మినహాయించి ఇతర కాలువల, తవ్వకాలను కాంగ్రెస్ సర్కార్ చేపట్టింది.
- జూన్ 14న తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ఆదేశాలతో 2014 జూలై 23న మాజీ మంత్రి హరీశ్‌రావు మహారాష్ట్ర వెళ్లారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ను కలిశారు. 152 మీటర్లకు తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు ఒప్పుకోవాలని కోరారు. అయితే ఒప్పందాలు చేసుకోకుండా ప్రాజెక్టుపై చేస్తున్న ఖర్చు వృథానేనని, పనులను తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేస్తూ అప్ప టికే ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖను ఆయన గుర్తుచేశారు. అదీగాక 152 మీటర్లకు అంగీకరించే ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చిచెప్పారు.
- కేసీఆర్ ఆదేశాలతో మరోసారి 2014 ఆగస్టు 16న విశ్రాంత ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్‌రావు, సహచర మంత్రి జోగు రామన్న, ఇంజినీర్ల బృందంతో కలిసి హరీశ్‌రావు మళ్లీ మహారాష్ట్ర వెళ్లారు. తెలంగాణకు 160 టీఎంసీలు కావాలంటే 152 మీటర్లకు ఒప్పుకోవాలని కోరారు. ఎంతంటే అంత భూమికి, పరిహారం డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అంగీకరించలేదు. స్వతంత్ర సంస్థతో సర్వే చేయిస్తామన్నరు.
- 2014 డిసెంబర్ 23 మరోసారి భేటీయ్యారు. మహారాష్ట్ర కోరిన రిపోర్టులను ఇచ్చారు.
- 2015 ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో ఇరు రాష్ర్టాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ 152 మీటర్లకు ఒప్పుకోవాలని కోరారు. ఆ మీటింగ్ మినట్స్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉన్నది.
- పుట్టిన రోజైనా కూడా 2015 ఫిబ్రవరి 17న స్వయంగా మాజీ కేసీఆరే మహారాష్ట్ర వెళ్లారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో అప్పటి, ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడణవీస్, మంత్రి గిరీశ్మహాజన్తో చర్చలను కొనసాగించారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్, తెలంగాణ బిడ్డ విద్యాసాగర్‌రావు ద్వారాను ప్రయత్నాలు చేశారు. 152 మీటర్లకు ఒప్పించాలని కోరారు. అయితే 152 మీటర్లతో ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఫడ్నవీస్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. అయితే 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించుకుంటే సహకరిస్తామని మాత్రం హామీ ఇచ్చారు.
- ఈ మేరకు 2016లో ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం జరిగింది.
నీటి లభ్యత లేకపోవడమూ కారణమే
మహారాష్ట్ర అభ్యంతరాలే కాదు నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చేసిన సూచనల నేపథ్యంలోనే తమ్మిడిహట్టి బరాజ్ ముందుకు సాగలేదు. హెడ్ ఎత్తు 4 మీటర్ల కుదింపుతో నీళ్ల డైవర్షన్ సామర్థ్యం తగ్గిపోతుంది. 150 రోజులపాటు నిరాటంకంగా నీటిని మళ్లించుకున్నా, గరిష్ఠంగా 44 టీఎంసీలకు మించి వినియోగించుకోలేని దుస్థితి. దీంతో ప్రాజెక్టు ఆయకట్టుకే దాదాపు 100 టీఎంసీల లోటు ఏర్పడుతుంది. మరోవైపు తమ్మిడిహట్టి దగ్గర తెలంగాణకు కావాల్సిన నీళ్లు లేవని సీడబ్ల్యూసీనే తెలిపింది. ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచిస్తూ 2015 ఫిబ్రవరి 18న ఒక లేఖ, 2015, మార్చి 4న మరో లేఖ రాసింది. తమ్మిడిహట్టి వద్ద ఉన్న 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాలకు 63టీఎంసీల వాటా ఉన్నదని, అవి పోగా మిగిలేది 102 టీఎంసీలేనని తేల్చిచెప్పింది.
2015 మార్చి 13న అప్పటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతి స్వయంగా తెలంగాణకు లేఖ రాశారు. నీటి లభ్యత లేని నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకోవాలని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ విశ్రాంత ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, సీనియర్ ఇంజినీర్లతో అనేక సమీక్షలు, అధ్యయనాలను నిర్వహించారు. పరిష్కారంగా, తెలంగాణ నీటి అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ఆదిలాబాద్ కోసం చేపట్టిన వార్దా ప్రాజెక్టును అటకెక్కించింది. కేంద్రానికి వివరాలను సమర్పించకపోవడంతో డీపీఆర్ వాపస్ వచ్చేలా చేసింది. మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టింది. తెలంగాణను కరువు కోరల్లోకి నెట్టింది. తీరా ఇంటాబయటా విమర్శలు వస్తుండటంతో మళ్లీ తమ్మిడిహట్టి బరాజ్ రాగం అందుకున్నది. మూడేండ్ల తర్వాత మహారాష్ట్రతో చర్చలు అంటూ కొత్త నాటకానికి తెరతీసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

