తమ్మిడిహట్టి రేవంత్ తొండాట
తమ్మిడిహట్టిపై చర్చల ఫలప్రదంలో నిజమెంత.. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సుముఖమా.. అదే నిజమైతే ఇద్దరు సీఎంల ఉమ్మడి ప్రెస్‌మీట్ లేదేం.
- కనీసం చర్చలు సఫలమని సంయుక్త ప్రకటన ఎక్కడ?
- ఇప్పటికే అధ్యయనం పూర్తయ్యాక మళ్లీ ఎందుకు?
- చర్చలు ఫలప్రదమని సొంతంగానే సీఎం రేవంత్ ట్వీట్
- మహా సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎందుకు ధ్రువీకరించలే?
- నిర్ణయాన్ని కేంద్ర జల సంఘానికే చెప్తామని ఎందుకన్నరు?
- ఏదీ తేలకున్నా ఏదో సాధించినట్టు కాంగ్రెస్ గొప్పలెందుకు?
- కరువులో కాళేశ్వరం నీళ్లెత్తకుండా ఇది మరో డైవర్షన్ గేమ్?
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు ప్రతిపాదనలపై మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందంపై పునఃపరిశీలనకు అభ్యంతరం లేదన్నారు. కేంద్ర జల సంఘం అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తుందని, ఈ లోగా రెండు రాష్ర్టాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో కమిటీ వేయాలని ప్రతిపాదించారు. బరాజ్ ఎత్తు, నీటి లభ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు.
– తెలంగాణ సీఎంవో
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు అంశాలను మహారాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా పరిశీలిస్తుంది. మొదట అంచనా వేసిన దానికంటే ముంపు ప్రాంతం ఇప్పుడు ఎకువ ఉంటుందని తేలింది. సవరించిన ప్రతిపాదనలతో కలిగే ప్రభావాలను క్షుణ్ణంగా అంచనా వేయాల్సిన అవసరం ఉన్నది. ముంపు ప్రభావం, వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోని అంశాలను పరిశీలిస్తాం. కేంద్ర జలసంఘం అభిప్రాయాన్ని కోరినప్పుడు మా వైఖరి తెలియజేస్తాం.
– మహారాష్ట్ర సీఎంవో
‘దివాలాగొట్టోడు తీర్థం పోతే దేవుడిని చూడక మర్లొచ్చిండు’ అని తెలంగాణలో పాపులర్ సామెత! సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మహారాష్ట్ర పర్యటన సరిగ్గా ఇలానే ఉన్నది. ప్రాణహితకు ఏవో అనుమతులు సాధిస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి వెళ్లి.. ఉత్త చేతులతో తిరిగొచ్చారు. అక్కడ ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చున్నారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్ ఏం ప్రిపేర్ అయ్యారో? ఎంత బాగా ప్రిపేర్ అయ్యారో? తెలియదుగానీ.. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా ‘ఏం సాధించారు?’ అంటే ఏమీలేదు.
ఆఖరుకు ఫేస్ సేవింగ్ కోసం.. తమ్మిడిహట్టికి మహారాష్ట్ర సానుకూలంగా ఉన్నదని.. అధికారుల కమిటీతో ఏదో ముందడుగు పడిందని సీఎంవో ట్వీట్లు పంచుకున్నది. పచ్చ మీడియా కూడా బాకా భజంత్రీలు వాయించింది. నిజానికి అలాంటి అనుకూల నిర్ణయమేదైనా జరిగి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఉమ్మడిగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పేవారు! అలాంటిదేమీ జరుగలేదు. అసలు ఉమ్మడి ప్రెస్‌మీటే లేదు. తెలంగాణ సీఎంవో ట్వీట్‌కు బదులా అన్నట్టు మహారాష్ట్ర సీఎంవో చేసిన ట్వీట్లో తమ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. జరిగిందిదైతే ఏదో తమ్మిడిహట్టి బరాజ్ 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అనుమతించినట్టు తెలంగాణ సీఎంవో సంభ్రమాశ్చర్యాలేమిటో ఎవరికీ అర్థం కావడంలేదు!
‘కొండంత రాగం తీసి’.. అన్నట్టు ఈ సమావేశం సాధించిందేమిటయ్యా అంటే ఓ అధికారుల కమిటీ! ఆ కమిటీ ఏం చేస్తది? మళ్లీ టేపులు, స్కేళ్లు, కొలతలు, కాంటూర్ లెవల్స్ పరికరాలు పట్టుకొని ఎంత ఎత్తున కడితే ఎంత ముప్పు? ఎంత నష్టం? వగైరా లెక్కలు వేస్తది. పోనీ ఇలాంటి అధికారుల కమిటీ నియామకం ఇదేమైనా కొత్తనా? అంటే.. ఇదే ప్రాణహితకు వైఎస్ నుంచి మొదలుకొని రోశయ్యతో పాటు ఉమ్మడి రాష్ట్ర ఆఖరు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు చాలా కమిటీలు హైదరాబాద్, ముంబై మధ్య అటూ ఇటూ చాలాసార్లు చక్కర్లు కొట్టాయి. ఆ కమిటీలు ఏం తేల్చాయి? అంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే కట్టాలని! కానీ 152 మీటర్ల ఎత్తులో కడితేగానీ తెలంగాణకు కావాల్సిన నీరు రాదు. అయినా ఈ బరాజ్‌ల ఎత్తులు, నదుల నీటి వాటాల నిర్ణయాలు తేల్చాల్సింది అధికారులో, అధికారుల కమిటీలో కాదు. దానికి కావాల్సింది రాజకీయ నిర్ణయం! అలాంటి నిర్ణయమేదీ రానేలేదు. ఒక పొరుగు రాష్ట్ర సీఎం అడిగినందుకు మర్యాద పూర్వక స్పందనగా ‘పరిశీలిస్తం’ అనే మాట మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి వచ్చిందేగానీ సానుకూలమని ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై చర్చించేందుకు భేటీ అయిన ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు.. ఆ తర్వాత విడుదల ప్రకటనలు భిన్నంగా ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలంగాణ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేయగా, అందుకు భిన్నంగా మహారాష్ట్ర సీఎంవో కార్యాలయంలో ప్రకటన ఉన్నది. స్వతంత్ర అధ్యయనం తరువాతే ప్రాజెక్టుపై తుది నిర్ణయం తీసుకుంటామని, కేంద్ర జలసంఘానికే తమ వైఖరిని తెలియజేస్తామనే ప్రకటనలో కరాకండిగా తేల్చిచెప్పింది. బరాజ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల బృందం సోమవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. బరాజ్ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భేటీ అనంతరం ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రు లు వెల్లడించిన అంశాల్లో ఎక్కడా పొంతనలేకపోవడంపై అనేక ప్రశ్నలకు లేవనెత్తుతున్నాయి.
సంయుక్త ప్రకటనకు భిన్నంగా..
సాధారణంగా ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడు సంయుక్తంగా పత్రికా సమావేశాలను నిర్వహించడం పరిపాటి. అందులోనూ అత్యంత కీలకమైన అంశాలయితే తాము తీసుకున్న నిర్ణయాలను కచ్చితంగా వారే స్వయంగా ప్రకటిస్తారు. చర్చల సారాంశాన్ని వివరిస్తారు. కానీ ప్రస్తుతం అలాంటిదేమీ జరుగలేదు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందం మహారాష్ట్రతో భేటీ అయ్యారు. బరాజ్ ఎత్తు పెంపుపై తాము చేసిన ప్రతిపాదనలపై మహారాష్ట్ర సానుకూలంగా స్పందించిందని ప్రకటన విడుదల చేశారు. అదే నిజమైతే సంయుక్తంగా ఎందుకు ప్రకటించలేదనేది ప్రశ్న. వాస్తవంగా ఒక రాష్ట్రం ప్రతిపాదనలపై, ప్రాజెక్టులపై ఎన్ని అభ్యంతరాలున్నా కూడా మరోరాష్ట్రం బాహాటంగా వ్యతిరేకించదు. పరిశీలిస్తామనే చెబుతూ దాటవేస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం ప్రకటనలో అదే ఉన్నది. దానికే మహారాష్ట్ర సీఎం సానుకూలంగా స్పందించారని రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రచారం మొదలుపెట్టి ఊదరగొడుతున్నట్టు స్పష్టంగా తెలిసిపోతున్నది.
అసలు ముంపునకు ఒప్పుకొన్నదా?
ఇదిలా ఉంటే బరాజ్ ఎత్తు పెంపు అంశంపై ఇంత జఠిలంగా మారడానికి ప్రధాన కారణం ముంపు సమస్య. 152 మీటర్ల వద్ద బరాజ్‌ను నిర్మిస్తే మహారాష్ట్రలో దాదాపు 3వేల ఎకరాలకు పైగా ముంపు వాటిల్లనున్నది. అదీగాక పలు గ్రామాలు సైతం ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం బరాజ్ ఎత్తు పెంపునకు అంగీకరించలేదు. తుదకు ఎలాంటి ముంపు ఉండబోదని నిర్ధారించుకున్న అనంతరం అదీ వెయిన్‌గంగా, వార్ధా కలిసిన అనంతరం 1.5కిమీ దిగువన ప్రాణహితపై 148మీటర్ల వద్ద బరాజ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కానీ ప్రస్తుతం బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు మార్చింది. ప్రాణహితపై కాకుండా వార్ధా, వెయిన్గంగాలను కలుపుతూనే బరాజ్ నిర్మించాలని ప్రతిపాదనలను చేసింది. దీంతో ముంపు మరింత ఎక్కువగా పెరిగే అవకాశమున్నది. స్వల్ప ముంపునకే అంగీకరించని మహారాష్ట్ర ఇప్పుడు అంగీకరిస్తుందా? అనేది ప్రశ్న. అదీగాక అసలు ముంపునకు మహారాష్ట్ర అంగీకరించిందా? లేదా? అనేది రేవంత్‌రెడ్డి ప్రకటనలో ఎక్కడా స్పష్టతనివ్వలేదు.
కాలయాపనకే మళ్లీ అధికారుల కమిటీ..
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును పెంపునకు తెలంగాణ చేసిన ప్రతిపాదనలకు సంబంధించి సాంకేతిక అంశాలను, మహారాష్ట్రలో ముంపుపై అధ్యయనం చేసేందుకు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ కార్యదర్శులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్వతంత్రంగా అధ్యయనం చేస్తామని మహారాష్ట్ర, లేదు ఇరు రాష్ర్టాల అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. అయితే వాస్తవంగా బరాజ్ ఎత్తు పెంపు, ప్రభావాలపై ఇప్పటికే అనేక కమిటీలు ఏర్పాటయ్యాయి.
అనేక అధ్యయనాలను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు, తెలంగాణ ఏర్పాటు అనంతరం సైతం సమగ్రంగా అధ్యయనం చేశారు. మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములు, ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. కేంద్ర జల సంఘం, కేంద్ర సంస్థ వ్యాప్కోస్, ఐఐటీ రూర్కి వంటి సంస్థలు సైతం స్వతంత్రంగానూ అధ్యయనం చేసి నివేదికలను ఇచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాజీ సీఎం కేసీఆర్ చర్చల సందర్భంగానూ అనేక దఫాలుగా సాంకేతిక అంశాలపై చర్చలు నిర్వహించారు. అధ్యయనాలను చేశారు. అన్నింటినీ నిగ్గుతేల్చారు. ఆ నివేదికలున్నాయి. కానీ మళ్లీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేవలం ఇది కాలయాపనకే తప్ప మరేమీ కాదని స్పష్టంగా తేలిపోయింది.
చర్చలు ఫలవంతంగా ముగిశాయి..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో నిర్వహించిన చర్చలు చాలా ఫలవంతంగా ముగిశాయి. తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును పెంచే విషయమై, మా ప్రతిపాదనను సానుకూలంగా, విశాల హృదయంతో పరిగణించారు. అందుకు మిత్రుడు ఫడణవిస్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ముంపునకు గురైన భూముల విస్తీర్ణం సమస్య సహా వివిధ సాంకేతిక సమస్యలను పరిశీలించడానికి అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఫడణవిస్ తన సొంత రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలను చూసుకుంటూనే, విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన వర్గాల జీవితాలను సానుకూలంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, మా వాదనను వివరిస్తూ సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు.
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (ఎక్స్ వేదికగా చేసిన పోస్టు)
మహారాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్యర్థన మేరకు, తమ్మిడిహట్టి సాగునీటి ప్రాజెక్టు ఎత్తును పెంచడానికి సంబంధించిన సమస్యలను మహారాష్ట్ర స్వతంత్రంగా పరిశీలిస్తుంది. మహారాష్ట్ర ప్రయోజనాలకు నష్టం లేనంతవరకూ తెలంగాణకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది. అయితే, కొత్త ప్రతిపాదనపై సమగ్రంగా అంచనా వేయడం అత్యవసరం. స్వతంత్ర అధ్యయనం, సవివరమైన సాంకేతిక చర్చల తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు.
– మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ (ఎక్స్ వేదికగా పోస్ట్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

