హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గిపోవడం గమనార్హం. 2021తో పోలిస్తే 2022లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ తెలిపింది. 2021లో రాష్ట్రంలో 303 రైతు ఆత్మహత్యలు నమోదవగా 2022లో 178 మాత్రమే నమోదైనట్టు తెలిపింది. తెలంగాణలో కౌలు రైతులు, వ్యవసాయ ఆధారిత కూలీల బలవన్మరణాలు నమోదు కాలేదని నివేదిక వెల్లడించింది. అయితే, దేశవ్యాప్తంగా నమోదైన అన్ని రకాల ఆత్మహత్యల్లో 6.6 శాతం మంది వ్యవసాయ రంగానికి చెందినవారే ఉండటం గమనార్హం. 2022లో దేశవ్యాప్తంగా అన్ని రకాల కారణాలు కలిపి 1,70,924 మంది ప్రజలు ఆత్మహత్య చేసుకోగా వారిలో 5,207 మంది రైతులతోపాటు మరో 6,083 మంది కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
2021తో పోలిస్తే 2022లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి చెందిన వారి ఆత్మహత్యల్లో 3.75 శాతం పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2021లో వ్యవసాయ రంగానికి చెందిన 10,881 మంది ఆత్మహత్య చేసుకోగా 2022లో 11,290 మంది రైతులు తమ ఉసురు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అమలుచేసిన రైతు.. వ్యవసాయ అనుబంధ పథకాలతో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినట్టు స్పష్టమవుతున్నది. రైతులను రాజులను చేయాలనుకున్న కేసీఆర్ తన హయాంలో రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు సెంటర్లు, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు వంటి చర్యలు తీసుకున్నారు. పెట్టుబడికి అప్పులుచేసి వాటిని తిరిగి చెల్లించలేక రైతులు ఆత్మహత్య చేసుకొనే సంఘటనలు గతంలో జరిగేవి. గత ప్రభు త్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 11 పర్యాయాలు రూ.73వేల కోట్ల వరకు పెట్టుబడి సాయం కింద అందించింది. దీంతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి.