హైదరాబాద్/సూర్యాపేట, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం టీఆర్ఎస్ వశమైంది. 2018 తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించింది. టీఆర్ఎస్ పుట్టిన తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గం మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుతో జిల్లా మొత్తం గులాబీ జెండా రెపరెపలాడింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల తర్వాత మూడు ఉప ఎన్నికలు జరిగాయి.
మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయంతో హ్యాట్రిక్ సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో తన భార్య పద్మావతిని పోటీ చేయించారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 2018లో గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతిచెందగా, 2021లో ఉపఎన్నిక జరిగింది. నర్సింహయ్య తనయుడు భగత్ టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
ఇక్కడ గులాబీ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మునుగోడులో 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాక.. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు జిల్లా మొత్తం గులాబీ వనంలా అద్భుతంగా మారింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక 2019 అక్టోబర్‌లో జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,359 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక 2021 ఏప్రిల్‌లో జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై నోముల భగత్‌కుమార్ 18,872 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.