హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించింది. ఇంతకుముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెను సోమవారం రౌస్ ఎవెన్యూ న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవిత రిమాండ్‌ను పొడిగించాలని అధికారులు ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజాకు విజ్ఞప్తి చేశారు.
నిందితుల పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ అధికారులు చెప్పారు. కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా.. న్యాయమూర్తి జోక్యం చేసుకొని దామోదర్, ప్రిన్స్‌కుమార్, అరవింద్‌సింగ్, చరణ్‌ప్రీత్ పాత్రను వివరించాలని సూచించారు. చార్జిషీట్‌ను దాఖలుచేసినందున కవితను విడుదల చేయాలని న్యాయవాది నితీశ్ రాణే కోరారు. చార్జిషీట్ అంశంపై మంగళవారం విచారణ జరపనున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది.