సిరిసిల్ల టౌన్/చిక్కడపల్లి, డిసెంబర్ 27: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీకి వ్యతిరేకంగా సిరిసిల్ల నేత కార్మికులు పోరుబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సిరిసిల్లలో సోమవారం నిరసన దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు దీక్షలో సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, సిరిసిల్ల సైజింగ్ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళతో పాటు టీఆర్ఎస్ నాయకులు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు, పట్టణ పద్మశాలి సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం జీఎస్టీని ఉపసంహరించుకొనేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పన్నుపోటు భారం వేయకుండా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చేనేత వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు ఎనుగుల ఎల్లయ్య, కార్యదర్శి గౌడ రాజు, సైజింగ్ ఓనర్ అసోషియేషన్ అధ్యక్షుడు గౌడ సురేశ్, పాలిస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడు మండల సత్యం, కార్యదర్శి వెల్దండి దేవదాస్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వీ శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల నారాయణ, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని రద్దుచేయాలి: రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
చేనేత, వస్త్ర పరిశ్రమపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ రద్దు కోసం ఐక్య ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వస్త్ర పరిశ్రమ-జీఎస్టీ పెంపుదలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుడు సాంబారి సమ్మారావు మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమపై కేంద్రం పెంచిన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకొని, ఉద్యమం చేపట్టడం ద్వారా ప్రయోజనం ఉంటుందని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో చేనేత ఉత్పత్తులపై ఎన్నడూ పన్ను లేదని, బీజేపీ ప్రభుత్వమే జీఎస్టీని విధించిందని పేర్కొన్నారు. జీఎస్టీ పెంపుదల వస్త్ర పరిశ్రమను చావుదెబ్బ తీస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు, టీడీపీ చేనేత సెల్ అధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్, వృత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, చేనేత పరిశోధకుడు డీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.