హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని గురుకుల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. జేఏసీ కేంద్ర కార్యాలయంలో శనివారం నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి ఏపీలో కేవలం 300లోపే ఉన్న గురుకులాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత 1023కు పెరగడం అభినందనీయమని, గురుకుల విద్యావ్యవస్థపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గురుకులాల్లో ఇటీవలి ఘటనలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో జేఏసీ నేతలు మామిడి నారాయణ, మధుసూదన్, జనార్దన్, అలగోని నరసింహులుగౌడ్, గణేశ్, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
‘విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టాలి’
హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం ఇంటర్మీడియట్ బోర్డు ముందు చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఫీజు కోసం వేధింపులతోపాటు ర్యాంక్‌లు, మార్కుల కోసం తీవ్ర ఒత్తిడి కలిగించడంతోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. అనుమతి లేని కళాశాలలు, పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ లీడర్లు కిరణ్, అశోక్‌రెడ్డి, లెనిన్, చరణశ్రీ, శ్రీమాన్, నాగేందర్, శివ, స్టాలిన్, లిఖిత్‌కుమార్, విఘ్నేశ్, మనోజ్, అరుణ్, లక్ష్మణ్, భగత్ పాల్గొన్నారు.