బాన్సువాడ రూరల్, డిసెంబర్ 13: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మెగులాన్‌పల్లి తండా జీపీ పరిధిలోని దంకుడుమోరి తండాకు చెందిన సభావత్ ప్రేమ్‌కుమార్ ఇండియా ఎకానమిక్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ గురువారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించాడు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆదిలాబాద్‌లోని జవహర్ నవోదయ పాఠశాలలో చదివిన ప్రేమ్‌కుమార్.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు.
ఢిల్లీ జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే 15వ ర్యాంకు సాధించి ఇండియా ఎకనామిక్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల కష్టాన్ని చూశాక మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట ప్రణాళికతో చదివానని ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఐఈఎస్‌కు ఎంపికై తన తల్లిదండ్రుల కలను సాకారం చేశానని చెప్పారు.