హిమాయత్‌నగర్, డిసెంబర్17: ఛత్తీస్‌గఢ్‌లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్కౌంటర్లు మొదలుపెట్టాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జీ లక్ష్మణ్, సీఎల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడారు. నారాయణపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు అటవీ సంపద కట్టబెట్టేందుకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మనిషి ప్రాణాలు కాపాడేందుకే రాజ్యాంగం ఉందని గుర్తుచేశారు. ఎన్కౌంటర్లతో ఆదివాసీల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకురాలు అనురాధ, శ్రామిక స్పందన కార్యదర్శి షేక్ షావలి పాల్గొన్నారు.