హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఈ నెల 4న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేశామని, అదేరోజు సాయం త్రం నాలుగు గంటల కల్లా తుది ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. హైదరాబాద్ బీఆర్కేఆర్ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మే 13న జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో 2.20 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
మంగళవారం ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా హాళ్లు ఏర్పాటు చేశామని, సమాంతరంగా ఓట్ల లెక్కింపు సాగుతుందని చెప్పా రు. రాష్ట్రంలోని 34 చోట్ల 120 హాళ్లలో 1,855 టేబుళ్లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లు, 276 టేబుళ్లు ఏర్పాటుచేశామని వివరించారు.
చేవేళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండు చొప్పున, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున హాళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటుచేశామని, బందోబస్తుకు 12 కంపెనీల కేంద్ర బలగాలతో సహా రాష్ట్ర పోలీసులను వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
నేడు మహబూబ్‌నగర్, 5న నల్లగొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
గత మార్చి 28న జరిగిన మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని వికాస్‌రాజ్ తెలిపారు. మే 27న జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా గ్రాడ్యుయేట్ శాసనమండలి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 5న జరుగుతుందని పేర్కొన్నారు.