Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులెదురొన్నా, ఏనాడూ ఆ పార్టీని ఒక మాట కూడా అనని వీర విధేయుడు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు కొనియాడారు. శాసనసభలో సోమవారం మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా బలపరుస్తున్నదని తెలిపారు. ప్రధానిగా, ఆర్థికమంత్రిగా, ఇతర కీలకపదవులను చేపట్టి మన్మోహన్సింగ్ దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు. ‘ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దానిపై ఏఐసీసీలో చర్చపెడితే మన్మోహన్ కంటతడి పెట్టారే తప్ప, తనను కాంగ్రెస్ నాయకులే తప్పుపట్టారని బాధపడలేదు. పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. ఆనాడు మన్మోహన్సింగ్ కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది’ అని హరీశ్‌రావు గుర్తుచేశారు.
‘మరో సందర్భంలో యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్‌కు రెండేండ్ల జైలు శిక్ష పడితే, లాలూను రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ప్రధానిగా మన్మోహన్ నిర్ణయం సరైందేనంటూ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టారు. హఠాత్తుగా అకడికి వచ్చిన రాహుల్‌గాంధీ ఆ ఆర్డినెన్స్ కాపీలను చింపివేశారు. ఒక ప్రధానిగా మన్మోహన్సింగ్, ఆయన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, దానిని కాంగ్రెస్ నేతగా ఉన్న రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. అయినా, మన్మోహన్ మౌన మునిలానే ఉన్నారు తప్ప, నోరు తెరిచి ఒక మాట కూడా అనలేదు. అందుకే కాంగ్రెస్ వీర విధేయుడు మన్మోహన్సింగ్’ అని వివరించారు. రెండోసారి ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు, కేసులు, అరెస్టులు జరిగాయని, కానీ ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌పై ఒక చిన్న మచ్చకూడా పడలేదని, అది ఆయన గొప్పతనమేనని కొనియాడారు. కేంద్ర క్యాబినెట్లో చేరిన కేసీఆర్‌కు నౌకాయాన శాఖను ఇచ్చారని, డీఎంకే పార్టీకి ఆ శాఖను త్యాగం చేసిన కేసీఆర్ తెలంగాణ కోసం ఆరు నెలలపాటు శాఖ లేని మంత్రిగా ఉన్నారని, ఈ సందర్భంగా కేసీఆర్‌ను మన్మోహన్సింగ్ ప్రశంసించారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
మన్మోహన్సింగ్ను తన క్యాబినెట్లోకి ఆర్థికమంత్రిగా తీసుకొని, దేశ రాజకీయాలకు పరిచయం చేసింది తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావని చెప్పారు. పీవీ నమ్మకాన్ని నిలిపిన మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి దశ, దిశను చూపారని కొనియాడారు. కారణాలేమోగానీ పీవీ మరణించిన రోజు కాంగ్రెస్ పట్టించుకోలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే పీవీ ఘాట్‌ను, పీవీ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, ఆయన జయంతి, వర్ధంతులను అధికారికంగా జరిపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని వివరించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి, మన పీవీ, మన ఠీవి అని ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత కూడా కేసీఆర్‌దేనని హరీశ్‌రావు కొనియాడారు. మన్మోహన్సింగ్ చరిత్రలో నిలిచిపోతారని అంటూ వారి కుటుంబీకులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరిట ఒక స్మారకాన్ని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని హరీశ్‌రావు స్వాగతించారు. అదే సమయంలో ప్రభుత్వానికి మరో సూచన కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న సిల్ యూనివర్సిటీకి మన్మోహన్సింగ్ పేరు పెట్టాలని ప్రతిపాదించారు. దీనిని బీఆర్ఎస్ నేతలే కాకుండా, కాంగ్రెస్ నేతలు కూడా స్వాగతించారు.
మన్మోహన్సింగ్ సుదీర్ఘకాలం రాజ్యసభలో మెంబర్‌గా కొనసాగారని, పెద్దల సభలో 33 సంవత్సరాలు సేవలు అందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. శాసనసభతో పాటు రాష్ట్ర శాసనమండలిలో కూడా సంతాప సమావేశాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక మంది ఎమ్మెల్సీలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు.
హైదరాబాద్, డిసెంబర్30 (నమస్తే తెలంగాణ): ‘మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్‌కు మీరిచ్చిన గౌరవమేది’ అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మాజీ మంత్రి హారీశ్‌రావు ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్‌కు సంతాప తీర్మానంపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. యూపీఏ సర్కార్ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఏర్పాటు అంశాన్ని చేర్చడం, ఆ క్రమంలో కేసీఆర్ కృషిని, మన్మోహన్సింగ్ ఔన్నత్యాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని కేవలం మన్మోహన్సింగ్ అంశానికే పరిమితం కావాలంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిని స్పీకర్ గడ్డం ప్రసాద్ సమర్థిస్తూ.. సంతాప తీర్మానం అంశానికే పరిమితం కావాలని హరీశ్‌రావుకు సూచించారు. ఈ సమావేశానికి రావాలని స్వయంగా తానే కేసీఆర్‌కు ఫోన్ చేశానని, ఆయినప్పటికీ రాలేదని, ఇదేనా గౌరవం అంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. దీనిపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్‌కు మీరిచ్చిన గౌరవమేదని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ నియామకం సందర్భంగా ఎందుకు ఫోన్ చేయలేదని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరినా ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రాజకీయాలకు ఇది సందర్భం కాదని అంటూ.. తిరిగి సంతాప తీర్మానంపై ప్రసంగాన్ని కొనసాగించారు.