చింతలమానేపల్లి, డిసెంబర్ 16 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో మంగళవారం తన భార్య,కొడుకులతో కలిసి కాలనీలకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు.
తనకు ఓటు వేసిన వారు పసుపు బియ్యం పట్టుకొని ప్రమాణం చేయాలని అభ్యర్థించారు. దీంతో స్థానికులు ‘నిన్ను ఎవరు డబ్బులు అడిగారు, ఎందుకు ఇచ్చావని’ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు మాత్రం తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు ఎలక్షన్ కోడ్ నిబంధనలు పాటించాలని ఓడిన అభ్యర్థిని, ఆయన కుటుంబసభ్యులను సముదాయించారు. దీంతో వారు వెనక్కి తగ్గారు.