హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏడాదిలోగా వైద్య కళాశాలల భవనాలతోపాటు దవాఖానాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం వైద్యారోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో ఇద్దరు మంత్రులు పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖకు నిధుల కేటాయింపు అంశంపై చర్చించారు. పేద, మధ్య తరగతి వర్గాలు అత్యధికంగా ఆధారపడే వైద్యారోగ్య శాఖకు ప్రాధాన్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీకి వచ్చే బడ్జెట్లో సమృద్ధిగా నిధులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిస్ట్రియాన చొంగతా, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆహ్మద్ నదీమ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, జాయింట్ సెక్రటరీ హరిత పాల్గొన్నారు.