హైదరాబాద్/పెద్దపల్లి/ఫర్టిలైజర్‌సిటీ, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గుజరాత్లో ఇటీవల పట్టుబడిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) సానుభూతిపరులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్) బృందాలు మంగళవారం హైదరాబాద్‌లోని పాతబస్తీ, పెద్దపల్లి జిల్లా రామగుండంలో సోదాలు నిర్వహించాయి.
తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సహాయంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి గోదావరిఖని శ్రీనగర్ కాలనీలో ఓ ఇంటిలో ఉంటున్న హైదరాబాద్ పాతబస్తీకి చెందిన మహమ్మద్ జావిద్ (46), అతని కూతురు ఖదీజా(20)ను ఏటీఎస్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వారిని హైదరాబాద్‌కు తరలించి కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇరువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయాన్ని రామగుండం పోలీసు కమిషనరేట్ పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గుజరాత్ ఏటీఎస్ బృందాలు సోదాలు జరిపినట్టు వినికిడి. ఐఎస్కేపీ అనేది నిషేధిత ఉగ్రవాద అంతర్జాతీయ సలాఫీ-జిహాదీ సంస్థ. ఐక్యరాజ్యసమితి నిషేధించిన తీవ్రవాద సంస్థ. ఈ సంస్థకు చెందిన ముగ్గురు పురుషులను పోరుబందర్లో, ఓ మహిళను సూరత్‌లో ఏటీఎస్ అరెస్టు చేసింది. వీరంతా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్వాసులుగా గుర్తించినట్టు సమాచారం.