షేక్‌పేట్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార జోరును పెంచింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇంటింటి ప్రచారం నిర్వహించి బాకీ కార్డుల పంపిణీ చేపట్టారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. షేక్‌పేట్ డివిజన్లోని మినీ బృందావన్ కాలనీలో గురువారం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ స్టిక్కర్లు పంపిణీ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, వహీద్ అహ్మద్, షకీల్ తదితరులు ఉన్నారు. బీజేఆర్‌నగర్‌లో కులసంఘాల నాయకులతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. షేక్‌పేట్ హరిజన బస్తీ, దత్తాత్రేయ కాలనీలలో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్‌కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.సమతా కాలనీలో మైనార్టీ ఫైనాన్స్ మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అమీర్‌పేట్, అక్టోబర్ 23: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ, ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ఇళ్ల వద్దకు వస్తున్న మాగంటి కుమార్తెలు..మాగంటి అక్షర, దిశిరలకు ఆయా కాలనీల్లో మహిళలు సాదర స్వాగతం పలకడంతో పాటు ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. గురువారం ఎర్రగడ్డ ఛత్రపతి శివాజీనగర్‌లో అక్షర, దిశిర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులు తమపై చూపుతున్న అభిమానాన్ని చూసి వారికి కొంత ఎక్కువ సమయాన్నే కేటాయించి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. ‘ఆందోళన పడొద్దమ్మా.. మా మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థ్ధి మాగంటి సునీతా గోపీనాథ్‌కే’ అని ఓటర్లు వారికి భరోస్తా ఇస్తున్నారు. అక్షర, దిశిరల ప్రచారానికి విశేష స్పందన వచ్చింది.
వెంగళరావునగర్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల మద్దతు ఉందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో కలిసి వెంగళరావునగర్ డివిజన్లోని యాదగిరినగర్ గురుద్వారా కాలనీలో మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ప్రజల్ని నమ్మించి ద్రోహం చేసిందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆరస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తన భర్త మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా మంచి పేరు సంపాదించారని..తాను కూడా అలాగే పనిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
షేక్‌పేట్ అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ విజయం ఖాయం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. షేక్‌పేట్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో యువకులు చెరక మహేష్ ఆధ్వర్యంలో గురువారం ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 23: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలంటూ మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు రహమత్‌నగర్ డివిజన్ పరిధిలోని బ్రహ్మశంకర్‌నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజలకు చేతినిండా పని దొరికేదని, అన్ని సంక్షేమ పథకాలు అందేవని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 23 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఖాయమన్నారు.
బంజారాహిల్స్,అక్టోబర్ 23: బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రహ్మత్‌నగర్ డివిజన్లో గురువారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నెలరోజులుగా ప్రతి గడపకు వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించడమే దీనికి కారణమన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు.. భీమయ్య, విజయ్ కుమార్, మధుసూధన్‌రెడ్డి, మాణిక్యం, ధర్మానాయక్, సునీల్ వాల్మీకీ, రాము తదితరులు పాల్గొన్నారు.
వెంగళరావునగర్, అక్టోబర్ 23: పేద ప్రజలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, వెంగళరావునగర్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జ్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబం కంటే ఎక్కువగా ప్రేమించారని.. తాను కూడా అలాగే నియోజవర్గ ప్రజలను కుటుంబంలా చూసుకుంటానని భరోసా ఇచ్చారు.
బోరబండ డివిజన్ ఎన్ఆర్ఆర్ పూరం సైట్-1, 2, 3 కాలనీల్లోని ఇళ్లు దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లకు నోచుకోలేదు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రత్యేక చొరవ తీసుకొని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాగా… ప్రభుత్వం జీవో నెం.96 జారిచేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఉచింతగా రిజిస్ట్రేషన్లు చేయించారు. దీంతో 1,800 కుటుంబాలు గోపన్న చేసిన మేలుతో లబ్ధిపొందాయి. భౌతికంగా గోపన్న మా మధ్యన లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మేలు బోరబండ ప్రజలు ఎప్పటికీ మరవరు.
– కృష్ణమోహన్, బోరబండ
నియోజకవర్గంలో అసలు అధికార యంత్రాంగం పనిచేస్తోందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 22 నెలల కాంగ్రెస్ పాలనలో స్థానికంగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ చిన్న పనికి సంబంధించిన ఫిర్యాదులైనా సరే అధికారులు సత్వరం స్పందించే వారు. ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఎర్రగడ్డ డివిజన్లో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు.
– దేవిక, ఆనంద్‌నగర్, ఎర్రగడ్డ
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ కుప్పకూలింది. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. ఈ ప్రభావం ఇతర రంగాలపై (ఇసుక, ఇటుక, ఐరన్)పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పనులు లేకపోవడంతో పేదలు కూలిపని చేసుకోవాలన్నా దొరకని పరిస్థితి నెలకొంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ది నేతలకు కరువైంది. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన దుస్థితి ప్రజలది. సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదు.
– ఎన్.నారాయణ, రిటైర్డ్ శాస్త్రవేత్త, వెంగళరావునగర్ కాలనీ