మట్టి దుక్కుల్లో ఆరుగాలం బొర్లీ బొర్లీ,
శ్వేదపు తటాకాల్లో ఈదీ ఈదీ అలసి,
ఒడ్డుకు చేరాక కణికెడు బువ్వో,
గిన్నెడు గంజో కాచుక తిందామన్న ఆశ.
పంటకు నీరందక, పొలం పొక్కిలై,
పంట పండుతుందో లేదోనన్న గోస,
గుండె గుబులెక్కి, ఒళ్లంతా దడపుట్టి.
ఆలి బిడ్డలు యాదొచ్చి చెమటపట్టింది.
పొలం బీటలు వారి, పాల కంకులు
గట్టి పడక, ఎండలకు ఎండుతుంటె
కావడి భుజాన, ఏట్లోని చెలిమల్లో వెతికినా,
కడవ నిండని నీళ్లు, ఏం చెయ్యాలో తెల్వలే
అధికారాల అలసత్వం ఇకిలిస్తుంటె
దరిద్రమ్మ దరిజేరి సకిలిస్తుంటె,
నెత్తిన చేతులెట్టి, నడి పొలంలో కూకుని,
సత్తువ లేకుండా ఏడ్చీ ఏడ్చీ గీపెట్టినా,
కనికరించేదెవరు? వీపు తట్టేవారెవరు?
కాళేశ్వరం కొడిగట్టి ఎడారిగా మారింది,
గోదావరిలో దొంగలు పడి దోచుకున్నరు,
మేడిగడ్డ జలం, పరాయోళ్లకొదిలిన్రు.
వాగులు వంకలు, గొల్సుకట్టు చెరువులు,
నీళ్లు లేక, రాళ్ళు రప్పలు మీటింగెట్టినయి.
కాళేశ్వర గంగమ్మను ఎత్తిపొయ్యరు
చెర్వుల్లో నీళ్లు లేక పల్లెలు తడారినయి,
ఇంకిపోయిన నీరు బోరెండి ఎక్కరించింది..
తేమ ఆవిరై ఎండ పొలాల మీద పడ్తొంది.
రైతుబంధు అందలె, బ్యాంకులప్పిస్తలె,
ఊళ్ళోని మిత్తీలోళ్ళు ఐదు వడ్డి అంటున్రు
ఆలి పిల్లలు యాదొచ్చి పది వేలు తెచ్చుకున్న.
ట్యాంకరు నీళ్ళు పోశాక గింజలు గట్టిపడ్డయి.
కోత మొదలెడ్దామని కొడవళ్లు నూరిన,
మా ఆవిడతో మరో ఇద్దర్ని కోతకు మాట్లాడిన.
గాలివాన, అర్ధరాత్రి, వడగండ్ల భీభత్సం,
పంట నీళ్లల్లో మునిగి, కడగండ్లు మిగిల్చింది.
తెలంగాణను పరిపాలించే ప్రభువుల్లారా,
కాళేశ్వరం నీళ్ళతో చెర్వులు నింపితే
గోదారి తల్లిని క్రిష్ణక్కని కలిపి తొలకొస్తే
రైతు బతుకుల కష్టం తప్పి బతికేవాళ్లం
ఓట్లేసి కూకొబెట్టినందుకు, మాకిదా శిక్ష?
మీ పదవి, మీ రాజకీయం, మాకు శాపమైందిలె.
రైతు గోస, శాపం పెట్టిన మట్టి భాష
రైతు కంటి నీటి రాజ్యం, నీర్లేని సేద్యం,
ఏనాడూ, బతికి బట్ట కట్టలేదు నాశనం తప్ప.
మా రైతుల శాపం, ఇది మా రైతుల ఉసురు.
దినాం దారినున్న గంగమ్మ తల్లి గుళ్లో
గంట కొట్టి మొక్కి దండాలు పెట్టినా
దేవతలూ పాలకుల ఉలుకు లేదు
రైతు జాతి బాగుపడ్తారన్న ఆశ లేదు.
ఆశలుడిగిన వేళ, బతుకు బరువెక్కిన వేళ,
పగ్గం చేబట్టి గంగమ్మ గుడికాడ మానెక్కి
గతం సుైళ్లెతే, అన్నింటిని దిగమింగి,
జీవగంట మోగిస్తే ఎవ్వరూ ఆపలె.
వాడి నేలన పడ్డ మట్టిపువ్వు జూసి,
ఆలి పిల్లలు తప్ప ఎవ్వరూ జాలి చూపలె..
– కమ్మ రంగరావు
94401 79410